మా ఊరి రోడ్లు – మా పిల్లల భవిష్యత్తు కాపాడండి
అక్రమ ఇసుక రవాణాపై కల్లూర్ గ్రామస్తుల ఆగ్రహం.. అధికారులకు విజ్ఞప్తి
కోటగిరి/ప్రజావాణి: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామం మీదుగా కోడిచెర్ల గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో భారీ ట్రాక్టర్ల రాకపోకల కారణంగా గ్రామంలోని ప్రధాన రహదారులు పూర్తిగా బురదమయంగా మారాయని, దీంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే రోగులు, సాధారణ ప్రయాణికులు బురద రోడ్లపై నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. భారీ ఇసుక ట్రాక్టర్ల రాకపోకల వల్ల గ్రామంలోని ప్రధాన కల్వర్టుకు కూడా పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇకపై వర్షాకాలంలో గ్రామం మీదుగా ఎలాంటి ఇసుక రవాణాకు అనుమతించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని కోటగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
ప్రజల భద్రత, గ్రామ రహదారుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కల్లూర్ గ్రామం మీదుగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయాలని రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.