prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 11:49 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మార్కాపురంలో సాగు కాలువ పూడికతీత పనులు పూర్తి: రబీ పంటలకు పుష్కలంగా సాగునీరు

  • కూటమి ప్రభుత్వ చొరవతో రూ. 3.10 లక్షల జలశక్తి నిధుల కేటాయింపు
  • హర్షం వ్యక్తం చేస్తున్న మార్కాపురం రైతాంగం
వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి జూన్ 09) పొరుమామిళ్ళ మండలంలోని మార్కాపురం గ్రామ రైతుల దశాబ్దాల సాగునీటి సమస్యకు తెరపడింది. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం సాగు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్కాపురం చెరువు నుండి వెళ్లే ప్రధాన పంట కాలువ పూడికతీత పనులను విజయవంతంగా పూర్తి చేయించింది.
గత కొంతకాలంగా తీవ్రంగా పూడిక పేరుకుపోయి, పొలాలకు నీరందక మార్కాపురం గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను కూటమి నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నాయకుల ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వ ‘జలశక్తి అభియాన్’ పథకం కింద రూ. 3,10,000 (మూడు లక్షల పది వేల రూపాయలు) నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువు నుండి సాగే సుమారు 3 కిలోమీటర్ల పొడవైన పంట కాలువ పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు.ఇన్నాళ్లుగా ముళ్ళపొదలు, మట్టితో నిండిపోయిన కాలువను అధునాతన యంత్రాలతో శుభ్రం చేయడంతో ప్రస్తుతం కాలువ రూపురేఖలు మారిపోయాయి. కాలువ పునరుద్ధరణ పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రబీ సీజన్‌కు చెరువు నుండి సాగునీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా పొలాలకు చేరుతుందని, దీనివల్ల వేలాది ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతు పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు మార్కాపురం గ్రామ రైతాంగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.