మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రాణాపాయం నుండి కోలుకోవాలి..

చెన్నారావుపేట జూలై 29 ప్రజావాణి
నర్సంపేట రాజకీయం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నియోజకవర్గ ప్రగతి రథసారథి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వార్త వినగానే చెన్నారావుపేట గడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుండెల్లో ధైర్యం నింపే నాయకుడికే గుండెపోటు రావడాన్ని అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు తట్టుకోలేకపోతున్నారు. తమ నాయకుడు ఆయురారోగ్యాలతో పునరుత్తేజం పొంది తిరిగి రావాలని కోరుతూ చెన్నారావుపేట గ్రామ శివాలయం బుధవారం ఉద్విగ్న ఘట్టాలకు వేదికైంది.నర్సంపేటను ప్రగతిపథంలో నిలిపిన ప్రియతమ నాయకుడి ప్రాణ రక్షణ కోసం తెలంగాణ ఉద్యమకారులు భక్తిపారవశ్యంతో మృత్యుంజయ హోమాలు, ప్రత్యేక శూలార్చనలు నిర్వహించారు. శంఖారావాలు, వేదమంత్రాల మధ్య పెద్ది త్వరగా కోలుకోవాలి అంటూ శివనామస్మరణతో దేవాలయ ప్రాంగణంలో వేడుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు అత్యంత భావోద్వేగంతో మాట్లాడుతూ.. నర్సంపేటకు మెడికల్ కాలేజీ తెచ్చి, ఎండిపోతున్న చేనులకు గోదావరి జలాలను పారించి, వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన భగీరథుడు పెద్ది నర్సంపేట రూపురేఖలు మార్చిన ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈనాడు హాస్పిటల్ బెడ్పై ఉండడం ప్రజల గుండెలను పిండేస్తోంది. ప్రజల ఆశీస్సులు, ఆ ముక్కంటి దయతో ఆయన ఖచ్చితంగా మృత్యుంజయుడై తిరిగి వస్తారు. మళ్లీ మన మధ్యకు వచ్చి ప్రజాసేవలో పాల్గొంటారు.అని ధీమా వ్యక్తం చేశారు.ఈ మహోజ్వల పూజా కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు మహమ్మద్ రఫీ, మూడు రమేష్, ఎడ్ల మల్లయ్య, గట్ల కృష్ణయ్య, కుసుమ నరేందర్, గణేష్, సాధు నర్సింగరావు, కడగండ్ల యాకయ్య, అజ్మీర రాజ్ కుమార్, బోద కల్పన-అరుణ్ కుమార్, నర్మెడి సాంబయ్య, గట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.