prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 10:48 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

మహేంద్రనగర్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి

ఘట్‌కేసర్, జూలై 20: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడ మహేంద్రనగర్ దివ్యాంగులు, సకలాంగుల కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

కాలనీలో ఉన్న బోర్‌వెల్ చాలా కాలంగా పాడైపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వినతిలో పేర్కొన్నారు. ఈ సమస్యపై గత ఫిబ్రవరి నెలలోనే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని తెలిపారు. బోర్‌వెల్ మోటారును మరమ్మతుల కోసం తీసుకెళ్లి తిరిగి అమర్చుతామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలనీవాసులు స్వంత ఖర్చులతో కొత్త మోటారు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అది కూడా పది రోజుల క్రితం పాడైపోయిందని పేర్కొన్నారు. దీంతో కాలనీలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అందువల్ల కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, బోర్‌వెల్ మరమ్మతులు చేపట్టి నిరంతర నీటి సరఫరా అందించాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరారు.

ఈ వినతిపత్రాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాం కుమార్, కొత్త సురేష్, కృష్ణ, మధు, నరసింహ, సప్న, అరుణ, స్వర్ణలత, యాదమ్మ, మల్లయ్య, రాజశేఖర్, ప్రతినిధులు సమర్పించారు.