సిద్దిపేట్ జూన్ 9, ప్రజావాణి
మహిళల, విద్యార్థినుల మరియు బాలికల రక్షణే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘షీ టీమ్స్’ నిరంతరం శ్రమిస్తున్నాయని సిద్దిపేట ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ.బి. దుర్గ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని దేశాయ్ బీడీ కంపెనీలో సిద్దిపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ దుర్గ మేడమ్ మహిళలకు చట్టాలపై, వారి హక్కులపై విస్తృత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘంగా వివరించారు. ఈవ్ టీజింగ్ (పోకిరీల వేధింపులు), పని చేసే చోట ఎదురయ్యే వేధింపులు మరియు సోషల్ మీడియా వేధింపులపై మహిళలు ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని, వీటిని అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్న పిల్లలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ లపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లీయింగ్ (ఆన్‌లైన్ వేధింపులు) పట్ల మహిళలు, యువతులు మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు.
మహిళలు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా అధైర్యపడకుండా తక్షణమే అత్యవసర సహాయం కోసం 100 నంబర్‌కు గానీ, లేదా సిద్దిపేట షీ టీమ్ నంబర్ 8712667434 కు గానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.