మధ్యమానేర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి..
పొత్తూర్ బ్రిడ్జిపై రైతుల భారీ ధర్నా
ఇల్లంతకుంట,జూలై 17(ప్రజావాణి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూర్ బ్రిడ్జిపై గురువారం రైతులు, మహిళలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. మధ్యమానేర్ జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కన్నెపల్లి పంపుహౌస్‌లను ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నందున ఆలస్యం చేయకుండా మధ్యమానేర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తూ, ధర్నా సందర్భంగా రైతులు, మహిళలు డిమాండ్లు, నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. “వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన… రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
రైతుల ధర్నాకు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు హాజరై మధ్యమానేర్ జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.