బుగ్గారం మండల ఎస్సై సతీష్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, బుగ్గారం 08 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి పురుషోత్తం రెడ్డిల ఆదేశాల మేరకు, ధర్మపురి సిఐ రాంనర్సింహరెడ్డి పర్యవేక్షణలో బుగ్గారం మండల ఎస్సై జి సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ధర్మపురి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన గడ్డం రవి మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల అనంతరం ధర్మపురి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జానకి ఎదుట హాజరుపరిచారు. నిందితుడి నేరాన్ని నిర్ధారించుకున్న మెజిస్ట్రేట్, అతనికి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని పోలీసులు జగిత్యాల సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై జి సతీష్ వాహనదారులకు కీలక సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అతివేగంతో వాహనాలను నడపరాదు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలతో పాటు జైలు శిక్షలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.