prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 6:19 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మట్టి గొంతుకకు అరుదైన గౌరవం, సింగర్ చుంచు నాగవ్వకు కేటీఆర్ ఘన సన్మానం!

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జూన్ 02 (ప్రజావాణి):

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక రంగంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మట్టి వాసనల జానపదానికి, తెలంగాణ గ్రామీణ గొంతుకకు దక్కిన అరుదైన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన సామాన్య మహిళ, జానపద గాయని చుంచు నాగవ్వ సాధిస్తున్న విజయాలు, ఆమెకు లభించిన ఘన సన్మానం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల యూట్యూబ్ వేదికగా “బాయిలోనే బల్లి పలికే” అనే జానపద పాట వరల్డ్ రికార్డులు.. ట్రెండింగ్‌లో నంబర్ వన్ గా నిలిచింది..! చుంచు నాగవ్వ పాడే ప్రతి జానపద పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె గొంతులో ఉన్న సహజత్వం, తెలంగాణ మట్టి మనస్తత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె పాటలు వరల్డ్ రికార్డ్స్ సృష్టించడమే కాకుండా, విడుదలైన ప్రతిసారీ ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఆమె పాడిన ప్రతి పాట దూసుకుపోతూ, జానపద కళకు సరికొత్త జీవం పోస్తోంది. నాగవ్వ ప్రతిభను, ఆమె సాధిస్తున్న రికార్డులను గుర్తించిన మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. వేదికపై సింగర్ నాగవ్వను కేటీఆర్ శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఒక సామాన్య గ్రామీణ కళాకారిణిని పిలిచి ఇంతటి అరుదైన గౌరవాన్ని ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నాగవ్వ ఈ స్థాయికి చేరడం వెనుక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించిన మద్దతు, అలాగే జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు సీనియర్ కళాకారుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగున్న ఇలాంటి అద్భుతమైన ప్రతిభను గుర్తించి, వారికి సరైన వేదికను కల్పించడం తమ బాధ్యతగా భావించిన సీనియర్ కళాకారుల గొప్పదనాన్ని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. సన్మాన గ్రహీతగా వేదికనెక్కిన నాగవ్వ, తనను సత్కరించిన నాయకుడు కేటీఆర్ పై స్వయంగా పాట పాడి అక్కడి వారిని అలరించారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునే గొప్ప మనసున్న మహారాజు కేటీఆర్ అంటూ ఆమె తన పాట ద్వారా కొనియాడారు. నాగవ్వ తనదైన శైలిలో, జానపద శైలిని జోడించి పాడిన ఆ పాటలకు అక్కడికి వచ్చిన ప్రజలు, అభిమానులు ఫిదా అయిపోయారు. సభకు వచ్చిన జనాలు నాగవ్వ పాటల శబ్దానికి తన్మయత్వం చెంది, ఈలలు వేస్తూ, చిందులు వేస్తూ ఊర్రూతలూగారు.  గుల్లకోట లాంటి ఒక చిన్న గ్రామం నుండి వచ్చి, ప్రపంచ వేదికలపై ట్రెండింగ్ లో నిలుస్తూ, రాష్ట్ర అగ్రనాయకుల చేత సన్మానాలు అందుకుంటున్న చుంచు నాగవ్వ ప్రయాణం ఎందరో గ్రామీణ కళాకారులకు స్ఫూర్తిదాయకం. మట్టి గొంతుకకు దక్కిన ఈ గౌరవం, తెలంగాణ జానపద కళకు దక్కిన గౌరవంగా భావించవచ్చు.