భూదాన్ భూములను పేదలకు పంచాల్సిందే…!
తెలంగాణ జన సమితి నేత గోపగాని శంకర్ రావు డిమాండ్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
పేద ప్రజలకు నివాస హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, భూదాన్ భూములను నిజంగా అర్హులైన పేదలకు కేటాయించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని వెలుగు మట్ల ప్రాంతంలో భూదాన్ భూములపై పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నేలకొండపల్లి భక్త రామదాసు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూదాన్ భూములుగా ఉన్న 62 ఎకరాల భూమి ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేదని చట్టాలు, కోర్టులు పేర్కొన్నప్పటికీ పేదల ఇళ్లను కూల్చడం అర్థం కాని చర్యగా ఉందని అన్నారు. పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ తమకు ఉన్న స్వల్ప వనరులతో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న సమయంలో వాటిని కూల్చివేయడం మానవత్వానికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి పేద కుటుంబానికి కనీసం 100 గజాల స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి మరియు జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే వినతిపత్రం అందజేశామని తెలిపారు. ప్రస్తుతం 70 గజాల భూమి ఇవ్వడం సరిపోదని, ఆ స్థలంలో కుటుంబానికి అవసరమైన విధంగా ఇల్లు నిర్మించుకోవడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికైనా వెలుగు మట్లలో ఉన్న 62 ఎకరాల భూదాన్ భూమిని పేద ప్రజలకు కేటాయించాలని, ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం లేకుండా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని శంకర్రావు అన్నారు. హైదరాబాద్‌లో అమలవుతున్న హైడ్రా విధానం మాదిరిగానే ఖమ్మం జిల్లాలో కూడా పారదర్శకంగా వ్యవస్థ ఉండాలని పేద ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
అదేవిధంగా కొన్ని రాజకీయ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి సమగ్ర సర్వే నిర్వహించి జిల్లాలో ఉన్న మిగులు భూములను గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలా చేస్తే నిజంగా భూమిలేని పేదలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు మాదాస్ శ్రీను, మండల నాయకులు మందడి వెంకటేశ్వరరావు, వడ్లమూడి వెంకట్ రాములు, నామరపు అచ్చయ్య, బస్వరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.