prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 4:37 pm Digital Edition : RAKESH PEDDAPALLY

భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు! రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి

 

కమిషనరేట్ పరిధిలో డ్యామ్‌లు, పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేత

ఆపద వస్తే ‘డయల్-100’కు కాల్ చేయండి

రామగుండం జూలై 30 ప్రజావాణి :

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అధికారులు జారీ చేసే సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ పరిధిలోని డ్యామ్‌లు, ప్రధాన పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు సీపీ వెల్లడించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎవరూ పర్యాటక ప్రాంతాలకు గానీ, జలపాతాల (వాటర్ ఫాల్స్) వద్దకు గానీ వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లడం ప్రాణానికే ప్రమాదకరమని, సరదా కోసం లేదా చేపల వేట కోసం నీటి వనరుల వద్దకు వెళ్లరాదని తీవ్రంగా హెచ్చరించారు.

వర్షాల వేళ ప్రజలు చెట్ల కింద గానీ, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద గానీ ఆశ్రయం పొందకూడదని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకరాదని సీపీ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, చెరువులు మరియు కుంటలు నిండి కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక వాహనదారులు రోడ్లపై ఉన్న గుంతల పట్ల జాగ్రత్త వహించాలని, కల్వర్టులు మరియు చిన్న వంతెనలపై నీరు పారుతుంటే వాహనాలతో వాటిని దాటేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.

స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, వైద్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. వరద నీరు ప్రవహిస్తున్న, రహదారులు దెబ్బతిన్న ప్రాంతాల్లో బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది SDRF బృందాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని, ఆపదలో ఉన్నవారు వెంటనే ‘డయల్-100’ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే 24 గంటలూ సహాయం అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.