బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం
ముగ్గురికి పునర్జన్మనిచ్చిన కొత్తపేట వాసి
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 07 (ప్రజావాణి):
మృత్యువు అంచున ఉండి కూడా ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపాడు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు. బ్రెయిన్ డెడ్ అయిన తన భర్త అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన ఆ భార్య నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మాసిపెద్ది నారాయణరావు ఈ నెల ఏప్రిల్ 2వ తేదీ (గురువారం) సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో తన ఇంటి నుండి పొలం వద్దకు బయలుదేరారు. అంబారీపేట గ్రామ స్టేజీ వద్దకు చేరుకోగానే, ఎదురుగా వస్తున్న ఓ కారు ఆయనను ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించి ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మృత్యువాత పడ్డారు. తీరని శోకంలో ఉన్నప్పటికీ, నారాయణరావు కుటుంబ సభ్యులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య రాణి, కుమారులు రఘుపతిరావు, రాకేష్ రావులు చర్చించుకుని, నారాయణరావు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘జీవన్ దాన్’ సంస్థ ప్రతినిధులను సంప్రదించి అవయవ దానానికి అంగీకారం తెలిపారు. కుటుంబ సభ్యుల నిర్ణయంతో, హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ వైద్య బృందం అవయవాలను సేకరించింది. నారాయణరావు నుండి సేకరించిన రెండు కిడ్నీలు, లివర్ (కాలేయం) వీటిని అవయవాల కోసం నిరీక్షిస్తున్న ముగ్గురు బాధితులకు అమర్చి వారికి పునర్జన్మను ప్రసాదించారు. ప్రాణం పోయినా మరికొందరిలో ప్రాణంగా నిలిచిన నారాయణరావు కుటుంబాన్ని గ్రామస్తులు, పలువురు ప్రముఖులు అభినందించారు.