గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) మంగళగిరిలో బిసి ధర్మ దీక్షకు పూర్తి బాధ్యత నాదే సంబంధం లేని వారిపైనా కేసులు పెట్టడం అనైతిక చర్య-బీసీ ధర్మదీక్ష కేసుల వెనుక ప్రభుత్వ కుట్ర పోలీసుల తీరుపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం మంగళగిరిలో బీసీల హక్కుల సాధన కోసం తాను చేపట్టిన బీసీ ధర్మదీక్ష లో పాల్గొన్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా బోడె రామచంద్రయాదవ్ ఆ పత్రికా ప్రకటనలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు.బీసీల హక్కుల కోసం నేను చేపట్టిన’బీసీ ధర్మదీక్ష’కు పిలుపునిచ్చింది నేను, దానికి పూర్తి బాధ్యత నాది. కానీ,ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా నాపై,నాతో పాటు దీక్షకు సంఘీభావం తెలిపిన అనేక మంది బీసీ బిడ్డలపై అక్రమ కేసులు నమోదు చేసింది. అంతటితో ఆగకుండా,దీక్షతో ఏమాత్రం సంబంధం లేని అమాయక యువత,మహిళలు, చివరికి తమ ఆవేదన వ్యక్తం చేయడానికి తెలంగాణ నుంచి వచ్చిన ఒక బీసీ నాయకుడిపై కూడా కేసు పెట్టడం అత్యంత దుర్మార్గం. ప్రభుత్వానికి దమ్ముంటే నాతో తేల్చుకోవాలి. అంతేగానీ, హక్కుల కోసం గొంతెత్తిన పాపానికి అమాయకులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం పాలకుల అసమర్థతకు నిదర్శనం ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి,వారిని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి,బీసీ ధర్మదీక్ష’కు సంబంధించి నమోదు చేసిన అక్రమ కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేయాలి. ముఖ్యంగా,ఈ ఘటనతో సంబంధం లేని అమాయక యువత,మహిళలు, ఇతర వ్యక్తుల పేర్లను కేసుల నుంచి వెంటనే తొలగించాలి. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీసీల హక్కుల సాధన పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని రామచంద్ర యాదవ్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.