బీరన్న దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనం
ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించిన కురుమ కులస్తులు
జమ్మికుంట, జూలై 22 (ప్రజావాణి):
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని బీరన్న దేవాలయంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మొక్కుల కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కురుమ సంఘ సభ్యులు, భక్తులు హాజరై బీరన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జమ్మికుంట కౌన్సిలర్, పట్టణ కురుమ సంఘం అధ్యక్షుడు ఒగ్గు రమేష్ మాట్లాడుతూ తొలి ఏకాదశికి హిందూ సంప్రదాయంలో విశిష్టమైన స్థానం ఉందన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని బీరన్న స్వామిని ప్రార్థిస్తూ ప్రత్యేక మొక్కులు చెల్లించినట్లు తెలిపారు.
సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొని ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి వేడుకలను ఇదే విధంగా ఘనంగా నిర్వహిస్తూ కురుమ సంఘం తమ ఆచార సంప్రదాయాలను పరిరక్షించుకుంటోందన్నారు. యువత కూడా సంప్రదాయాలను కొనసాగిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా వైస్ చైర్మన్ పింగళి రమేష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాయిని రవి, వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు, కురుమ సంఘం కుల పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
