•బంధం కొమ్ము వద్ద డ్రైనేజీ పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు
*వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల భయం.. తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
అమీన్పూర్ ,జూన్ 15 (ప్రజావాణి) :అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్–అమీన్‌పూర్ రోడ్డులో బంధం కొమ్ము వద్ద డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. దుర్వాసన వెదజల్లడంతో పాటు పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నిల్వ నీటి కారణంగా దోమల వ్యాప్తి పెరిగి, మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం ప్రజల రాకపోకలు అధికంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమీన్‌పూర్ మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించడంతో పాటు ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

