prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:58 pm Digital Edition : RAKESH PEDDAPALLY

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే డిపెండెంట్లకు తీవ్ర అన్యాయం

 

మారుపేర్లు, విజిలెన్స్ కేసుల బాధితులకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు

 కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి: వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని  ఆగస్టు 8 ప్రజావాణి :

సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు నేటికీ ఉద్యోగాలు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఘాటుగా విమర్శించారు. శనివారం సింగరేణి ఆర్‌జీ-1 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట బాధితులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితుల సమస్య గత ఏడెనిమిది ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా చర్చించి వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినా, ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ నమ్మకంతోనే బొగ్గు గని ప్రాంత ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించారని స్పష్టం చేశారు. బాధితులకు ఉద్యోగాల కేటాయింపుపై అడ్వకేట్ జనరల్ (ఏజీ) సలహా కోరామని, అక్కడ నుంచి ఆదేశాలు రాగానే నియామకాలు చేపడతామని యాజమాన్యం చెబుతోందన్నారు. ప్రభుత్వం తలచుకుంటే న్యాయశాఖ మంత్రి లేదా ఏజీకి తగిన సూచనలు చేసి ఈ ఫైలును వెంటనే క్లియర్ చేయవచ్చని తెలిపారు.

గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ తొలి స్ట్రక్చర్ సమావేశంలోనే ఈ డిమాండ్‌ను యాజమాన్యం ముందుంచిందని, సమ్మె నోటీసులోనూ చేర్చామని పేర్కొన్నారు. కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు ఇచ్చే వరకు ఏఐటీయూసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు దాసరి శ్రీనివాస్, బిట్టి వెంకటేశ్వర్లు, ఏ.వి.ఎస్. ప్రకాశ్, ప్రీతం, కార్యాలయ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.