prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 1:42 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణానికి సమగ్ర హౌసింగ్ పాలసీ అమలు చేయాలి

ఘాట్ కేసర్, మే 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని (ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ పాలసీ) వెంటనే అమలు చేయాలని రెవెన్యూ ఆఫీసర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సొసైటీ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.

ఇటీవల ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి సమగ్ర హౌసింగ్ పాలసీపై ప్రాజెక్ట్ నివేదిక అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు భవిష్యత్ నగరంలో తక్కువ ధరలకు, సక్రమ ప్రణాళికతో గృహాలను అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, భవిష్యత్ నగర పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆసక్తి చూపినట్లు వినతిపత్రంలో వెల్లడించారు. ఈ భూమిని టీజీఐఐసీకి కేటాయించిన విధానంలోనే రాయితీ ధరలకు అందించాలని కోరారు. గృహ నిర్మాణానికి సంబంధించిన భూకేటాయింపులు, పరిపాలనా అనుమతుల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.