యోగాంధ్ర–2026కు శ్రీకారం.. ఉండవల్లి గుహల వద్ద తొలి యోగా కార్యక్రమం
యోగాను జీవితంలో భాగం చేసుకుందాం: కమిషనర్ పిలుపు
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం: కమిషనర్ అలీమ్ బాషా
జూన్ 8న ఉదయం 6 గంటలకు నిర్వహణ – భారీగా పాల్గొనాలని పిలుపు
మంగళగిరి (జూన్ 06) ప్రజావాణి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాలకు మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో శ్రీకారం చుడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలి యోగా కార్యక్రమాన్ని జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు ఉండవల్లి గుహల వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడం,ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం,శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం యోగాంధ్ర–2026 ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవనశైలికి మార్గదర్శకమని, నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే సాధనమని వివరించారు.యోగాంధ్ర–2026 కార్యక్రమాల కింద నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు.యోగా సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేసే లక్ష్యంతో పలు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఉండవల్లి గుహల వద్ద నిర్వహించే తొలి యోగా కార్యక్రమంలో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు,ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు,విద్యార్థులు,యువత మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు పాల్గొనదలచిన వారు ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక పోర్టల్‌తో పాటుhttps://www.gswshelper.com/2026/06/ap-yogandhra-campaign-2026-registration-guide.html లింక్ ద్వారా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.రిజిస్ట్రేషన్ ద్వారా పాల్గొనేవారి వివరాల సమన్వయం సులభతరం అవుతుందని తెలిపారు.యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కమిషనర్ అలీమ్ బాషా పిలుపునిచ్చారు.యోగా సంస్కృతిని ప్రజల్లో మరింత విస్తరించేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు