prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 4:48 pm Digital Edition : PRAJA VANI

ప్రజాభిమానంలో అగ్రస్థానంలో పుత్తూరు, శ్రీకాళహస్తి రవాణాశాఖ కార్యాలయాలు

తిరుపతి, జూన్ 23:
ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడంలో తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయాలు విశిష్ట ఫలితాలు సాధిస్తున్నాయని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు.
ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ స్పందన విధానంలో పుత్తూరు మోటారు వాహనాల తనిఖీ కార్యాలయం గత రెండు నెలలుగా వరుసగా వంద శాతం సానుకూల ప్రజాభిప్రాయం నమోదు చేసి రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు మొదటి స్థానం సాధించడం విశేషమని తెలిపారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించబడిందన్నారు.
అదేవిధంగా, మోటారు వాహనాల తనిఖీ అధికారి దామోదర నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మోటారు వాహనాల తనిఖీ కార్యాలయం తొంభై ఆరు శాతం సానుకూల ప్రజాభిప్రాయం నమోదు చేసి రాష్ట్రంలో రెండవ స్థానం సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ ఫలితాలు సంబంధిత మోటారు వాహనాల తనిఖీ అధికారులు, సహాయ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతకు, అంకితభావానికి, క్రమశిక్షణకు, సేవా దృక్పథానికి నిదర్శనమని తెలిపారు.
ప్రజలకు సత్వర, పారదర్శక, మర్యాదపూర్వక సేవలు అందించడం, సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్లనే ఈ స్థాయి ప్రజాదరణ లభించిందన్నారు.
ఈ సందర్భంగా పుత్తూరు మోటారు వాహనాల తనిఖీ అధికారి చంద్రశేఖర్, శ్రీకాళహస్తి మోటారు వాహనాల తనిఖీ అధికారి దామోదర నాయుడు మరియు సిబ్బందిని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ జ్ఞాపికలతో సత్కరించారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రజల సంతృప్తి, విశ్వాసమే ప్రభుత్వ సేవల విజయానికి నిజమైన కొలమానమని, ప్రజా సేవలో నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా ప్రజల ఆదరణను మరింత పెంపొందించుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు.