తిరుమలాయపాలెం, ప్రజావాణి:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణనష్టాలను నివారించడం లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడో విడత ‘అరైవ్… అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నిర్వహించినట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఆటో యూనియన్ సభ్యులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరు తమ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీటుబెల్ట్‌లు ధరించకపోవడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్‌లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్‌టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం ద్వారా వారు మళ్లీ తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడేలా చేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సహాయం చేసే వ్యక్తులను ప్రభుత్వం “రహవీర్”గా గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందజేస్తుందని, పోలీసులు గౌరవం కూడా ఇస్తారని తెలిపారు.మండలంలోని ప్రధాన రహదారులపై వేగ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇంటికి ‘అరైవ్ అలైవ్’ సందేశాన్ని తీసుకెళ్లి ప్రమాద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.