మన ప్రజావాణి ప్రతినిధి చిగురుమామిడి; కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ ప్రజల అసంతృప్తికి కారణమైంది. గ్రామసభ అంటే గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చర్చించే వేదిక కావాల్సి ఉండగా, కేవలం అధికారిక కార్యక్రమంగా నిర్వహించారని గ్రామస్తులు విమర్శించారు.గ్రామసభకు హాజరైన ప్రజలు ఎండలోనే కూర్చోవాల్సి రావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం నీడలో కూర్చోగా గ్రామ ప్రజలకు కనీసం టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆరోపించారు. ప్రజల కోసం నిర్వహించే సమావేశాల్లో ప్రజలకే ప్రాధాన్యం లేకపోవడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ అభివృద్ధి, సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరగాల్సిన గ్రామసభ కేవలం సంతకాల ప్రక్రియకే పరిమితమైందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు వినకుండా గ్రామసభలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఇకనైనా గ్రామసభలను పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు గౌరవం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.