పోరుమామిళ్ల బస్టాండులో ప్రయాణికులకు చుక్కెదురు: కదులుతున్న ‘ఎంక్వయిరీ’ ఫ్యాన్.. కదలని అధికారుల గుండెలు!
వైఎస్ఆర్ జిల్లా (ప్రజావాణి జూన్ 21) పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.ఎండల తీవ్రతతో బస్టాండుకు వచ్చే ప్రయాణికులు అల్లాడిపోతుంటే,వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.బస్టాండు ప్రయాణికుల వెయిటింగ్ హాల్‌లో ఫ్యాన్లు తిరగడం లేదు. కానీ,ఎంక్వయిరీ రూమ్ (విచారణ గది) లో మాత్రం ఫ్యాన్లు నిరంతరాయంగా తిరుగుతుండటం గమనార్హం.ఈ వివక్షపై స్థానిక ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉక్కపోతతో ప్రయాణికుల నరకం
పోరుమామిళ్ల బస్టాండు గుండా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.వృద్ధులు,మహిళలు,చిన్న పిల్లలు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.ప్రస్తుతం ఉన్న ఉక్కపోతకు తోడు బస్టాండు ఆవరణలో ఫ్యాన్లు పని చేయకపోవడంతో ప్రయాణికులు చెమటతో తడిసి ముద్దవుతున్నారు.కొందరు ప్రయాణికులు విసనకర్రలతో,మరికొందరు చేతిలో ఉన్న పేపర్లతో విసురుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రయాణికులు కూర్చునే చోట ఫ్యాన్లు లేకపోయినా పట్టించుకోని ఆర్టీసీ సిబ్బంది,తాము కూర్చునే ఎంక్వయిరీ గదిలో మాత్రం ఫ్యాన్లను పూర్తిస్థాయిలో తిప్పుకుంటున్నారు.”మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు,అధికారులకు మాత్రం చల్లటి గాలి కావాలా?”అంటూ ప్రయాణికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వ సంస్థలో ప్రయాణికులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బస్టాండులో పని చేయని ఫ్యాన్లను వెంటనే బాగు చేయించాలని లేదా కొత్త ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించి పోరుమామిళ్ల బస్టాండు సమస్యను పరిష్కరించాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.