
కడప జిల్లా ప్రజావాణి న్యూస్,(ఏప్రిల్ 29) పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న అంగళ్లలో లూజ్ వాటర్ లేదా వాటర్ ప్యాకెట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చాలా అంగళ్లలో కేవలం వాటర్ బాటిల్స్ మాత్రమే విక్రయిస్తున్నారని వారు చెబుతున్నారు. రోజువారీ కూలీలు, విద్యార్థులు, వృద్ధులు,పేద కుటుంబాలకు చెందిన ప్రయాణికులు బాటిల్స్ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న ఈ సమయంలో తాగునీటి కొరత మరింత ఇబ్బందికరంగా మారిందని వారు అంటున్నారు.ప్రత్యేకంగా బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులకు చల్లని తాగునీరు అత్యవసరమైందని, కనీసం లూజ్ వాటర్ లేదా తక్కువ ధరలో వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.సంబంధిత ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ పరిధిలో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, అంగళ్లలో వాటర్ ప్యాకెట్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రయాణికుల దాహార్తి తీర్చే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.