కడప జిల్లా పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 29) మండల కేంద్రంలోని గిరి నగర్ కాలనీలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగుచూసింది. నడవలేని స్థితిలో ఉన్న 82 ఏళ్ల దళిత వృద్ధుడు బొజ్జ ఐజయ్యకు రేషన్ బియ్యం అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ ఇంటికీ రేషన్ పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వృద్ధులకు నరకం కనిపిస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది.కదిలిస్తే కన్నీరు.షాపుల చుట్టూ తిరగలేక అల్లాడుతున్న వృద్ధుడు వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బొజ్జ ఐజయ్య, రేషన్ బియ్యం కోసం కన్నీరు మున్నీరవుతున్నారు.”నాకు 82 ఏళ్లు.కాళ్లు సహకరించవు. ఇంటికి బియ్యం పంపిణీ చేయాల్సింది పోయి, నన్ను రేషన్ షాపుల చుట్టూ తిప్పుతున్నారు. ఈ వయసులో షాపుల వెంట తిరగలేక అల్లాడిపోతున్నాను” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం వృద్ధులు,దివ్యాంగులకు ఇంటివద్దకే రేషన్ అందించాల్సి ఉండగా, ఐజయ్యకు మాత్రం ఆ భాగ్యం కరువైంది. డీలర్ నిర్లక్ష్యం: ఇక్కడ లేదు.వేరే దగ్గరకు పో” అంటూ వేధింపులు గిరి నగర్ కాలనీలోని రేషన్ షాప్ నంబర్ 15 డీలర్ ప్రవర్తన ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. బియ్యం కోసం వెళ్లిన ఐజయ్యకు సాయం చేయాల్సింది పోయి,”నీ రేషన్ ఇక్కడ లేదు, వేరే షాపునకు వెళ్లి తెచ్చుకో”అంటూ డీలర్ నిర్దయాత్మకంగా సమాధానం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.సాంకేతిక కారణాలు లేదా బయోమెట్రిక్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత డీలర్ సంబంధిత అధికారుల పై ఉంది.కానీ, బాధ్యతారహితంగా వృద్ధుడిని ఇబ్బందులకు గురిచేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ నిబంధనలు ఏమయ్యాయి?అధికారుల పర్యవేక్షణ లోపం ప్రభుత్వం వృద్ధులకు ఇళ్ల వద్దకే సరుకులు పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ పోరుమామిళ్ల గిరి నగర్ షాప్ నంబర్ 15 పరిధిలో ఈ నిబంధనలు తుంగలో తొక్కినట్లు స్పష్టమవుతోంది. 82 ఏళ్ల వృద్ధుడు రేషన్ కోసం వీధుల వెంట తిరుగుతున్నా స్థానిక యంత్రాంగం పట్టించుకోకపోవడం పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోంది. దళిత వృద్ధుడి పట్ల డీలర్ వ్యవహరించిన తీరుపై సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే స్పందించి న్యాయం చేయాలి: స్థానికుల శక్తి లేని బొజ్జ ఐజయ్యకు తక్షణమే ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గిరి నగర్ కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధుడిని మానసికంగా,శారీరకంగా ఇబ్బంది పెట్టిన షాప్ నంబర్ 15 డీలర్‌పై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఐజయ్య రేషన్ కార్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.