ఘట్‌కేసర్ : జనగామ శాసనసభ్యులు, మాజీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను పోచారం డివిజన్‌లో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను చేపట్టి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. సింగపూర్ టౌన్‌షిప్‌లోని ఆగాపే అనాథ పిల్లల ఆశ్రమంలో నోట్‌బుక్స్ పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు నిర్వహించారు. యమ్నంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదం అందించారు. నీలిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొండల్ రెడ్డి మాట్లాడుతూ, పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నీలిమ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనేక గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, రోగులకు ఉచిత వైద్యం, మందుల పంపిణీ చేపడుతూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి ప్రజాసేవకుడి జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్, చింతల రాజశేఖర్, సామల బుచ్చిరెడ్డి, అబ్బావతిని నరసింహ, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, జితేందర్ నాయక్, రాఘవేందర్ రెడ్డి, కే.యం. రెడ్డి, పోలగోని రాజేష్ గౌడ్, సూర్య యూత్ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.