prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 10:03 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పొన్నూరు పేకాట హబ్‌గా మారిందా..మారనుందా..

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) జిల్లాలపై పంజా విసిరిన మాఫియా చట్టానికి బహిరంగ సవాల్.పొన్నూరు టౌన్ & రూరల్.పొన్నూరు పరిసర ప్రాంతాల్లో పేకాట బంకీల దందా అదుపుతప్పి బహిరంగంగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.మొన్న తాళ్లపాలెం రైల్వే గేటు డొంకలో,నిన్న చుండూరు పల్లి కొమ్మూరు కాలువ గట్టు,డొంకలు,మెట్ట పొలాలను అడ్డాగా చేసుకుని నిర్వాహకులు నిర్భయంగా జూదాన్ని నిర్వహిస్తున్నారని రైతులు,మహిళా రైతు కూలీలు,స్థానికులు చెబుతున్నారు.పంటలు చేతికొచ్చే ఈ సమయంలో పొలాల్లో పనిచేస్తున్న రైతులు,మహిళా కూలీలు ఈ ఆగడాలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.రెండు కిలోమీటర్ల పరిధిలో చెట్టు కింద చెట్టు వద్ద మోటార్ సైకిళ్లు నిలిపి,రైతుల్లా నటిస్తూ జూదరులు సంచరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.వివిధ జిల్లాల నుంచి కార్లలో వచ్చే వారికి నిర్వాహకులే రవాణా,భద్రత కల్పిస్తున్నారనే ఆరోపణలు దందా వ్యవస్థీకృతతను స్పష్టం చేస్తున్నాయి.ఇక ఈ నెట్‌వర్క్ ఒక్క పొన్నూరుకే పరిమితం కాకుండా ఒంగోలు,విజయవాడ,రేపల్లె,చిలకలూరిపేట,నరసరావుపేట ప్రాంతాల వరకు విస్తరించినట్లు సమాచారం.రోజూ 45 నుంచి 60 మంది వరకు పాల్గొంటూ,ఒక్కొక్కరి నుంచి సుమారు రూ 1000 వసూలు చేస్తూ,మధ్యలో పేక మారిస్తే అదనంగా రూ 500 వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.డిజిటల్ లావాదేవీలు,ఫైనాన్స్ సౌకర్యాలు కూడా అందిస్తున్నారనే విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఫోన్‌పే ద్వారా రూ 10,000 చెల్లిస్తే రూ9,500 నగదు అందజేస్తూ,అదే మొత్తంపై రోజుకు రూ 500 వడ్డీతో అప్పులు ఇస్తున్నారని సమాచారం.నిరంతరం పహారా మధ్య ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.తాళ్లపాలెం రైల్వే డొంకలు,చుండూరుపల్లి కొమ్మూరు కెనాల్ గట్లు వంటి ప్రదేశాలు జూద కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.పలు జిల్లాల నుంచి జూదరులు పొన్నూరుకు తరలివస్తుండటం,ఈ మాఫియా నెట్‌వర్క్ విస్తృతిని,బహిరంగంగానే బలపరుస్తున్నాయి.అక్రమాలను ప్రశ్నించే సామాన్యులను భయపెట్టడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వాతావరణాన్ని లవర పెడుతున్నాయి.ఇక అధికార యంత్రాంగం స్పందనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ పేకాట దందా కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతుండగా,యువత చెడు మార్గాల వైపు మళ్లుతున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అక్రమ పేకాట బంకీలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని,నిర్వాహకులతో కుమ్మక్కైన ప్రభుత్వయంత్రాంగంపై సమగ్ర విచారణ చేపట్టాలని శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.జిల్లాల మీదుగా విస్తరించిన ఈ పేకాట మాఫియాను వెంటనే అరికట్టకపోతే పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు