prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 8:22 am Digital Edition : RAJASHEKARREDDY

పొద్దుతిరుగుడు పంట కొనుగోలు వెంటనే ప్రారంభించాలి సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ బెజ్జంకి


బెజ్జంకి, ఏప్రిల్ 20(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సీపీఎం పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సిద్ధిపేట జిల్లాకు కేటాయించిన కోటా పూర్తయిందని చెబుతూ కొనుగోళ్లు ఆపివేయడం అన్యాయమని విమర్శించారు.బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వందల ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశారని, ప్రస్తుతం కొంత పంట మాత్రమే మార్కెట్‌కు రాగా, ఇంకా పెద్ద ఎత్తున కోత దశలో ఉందని ఆయన చెప్పారు. దాదాపు 8 వేల క్వింటాళ్ల పంట ఇంకా కొనుగోలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే తమ వాటా పూర్తయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తప్పించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జిల్లా అధికారులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, రైతుల పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సీపీఎం నాయకులు జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులకు ఫోన్ ద్వారా రైతుల సమస్యలను వివరించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.