prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 1:43 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పైడిపల్లిలో ఆయిల్ పామ్ మొదటి గెలల కోత ప్రారంభించిన, ఉద్యానవన అధికారి వంశీ కృష్ణ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మే 11 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో సోమవారం ఆయిల్ పామ్ సాగులో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఉద్యానవన విస్తరణ అధికారి వేముల వంశీ కృష్ణ సమక్షంలో రైతులు జైన అభినవ్, గంగుల నగేష్‌కు చెందిన తోటల్లో మొదటి ఆయిల్ పామ్ గెలల కోతను ఘనంగా ప్రారంభించారు. 2022-23 సంవత్సరంలో నాటిన వివిధ ఆయిల్ పామ్ తోటలను ఈ సందర్భంగా అధికారులు సందర్శించారు. పైడిపల్లిలో 2.20 ఎకరాల్లో సాగు చేస్తున్న అభినవ్, నగేష్‌ల తోటలను పరిశీలించిన అధికారి, మొక్కల ఎదుగుదల, దిగుబడిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు సగటున 10 నుండి 12 గెలలు ఉండటం విశేషమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ… రైతులకు పలు సూచనలు చేశారు, ప్రతి 20 రోజులకు ఒకసారి గెలలు కోతకు వస్తాయని, దీనివల్ల రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ ధర రూ. 23,500 పలుకుతోందని వెల్లడించారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటివరకు రైతులు మొత్తం 16 టన్నుల దిగుబడిని సాధించినట్లు ఆయన వివరించారు. రైతులు సంప్రదాయ పంటల కంటే నూతన సాగు పద్ధతుల వైపు మొగ్గు చూపాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గెలల కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ దశల్లో ఉన్న గెలలకు వేయాల్సిన ఎరువుల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానవన శాఖ సూచించిన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని, రైతులు కొత్త పంటల సాగుకు ధైర్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లోహియా కంపెనీ క్లస్టర్ మేనేజర్ మహర్షి, ఫీల్డ్ ఆఫీసర్, అభ్యుదయ రైతులు, స్థానికులు పాల్గొన్నారు.