prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 11:57 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పేకాట, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్‌పై కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రజావాణిన్యూస్(మార్చి22)ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీసులు పేకాట, కోడి పందాల స్థావరాలు,క్రికెట్ బెట్టింగ్‌లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ ప్రత్యేక దాడులలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగి, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆధునిక సాంకేతికతను వినియోగించారు. అందులో భాగంగా డ్రోన్ కెమెరాలను సమర్థవంతంగా ఉపయోగిస్తూ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పొలాలు, చెట్లతో కప్పబడి ఉండే ప్రాంతాలు మరియు సులభంగా గుర్తించలేని రహస్య ప్రదేశాలలో నిర్వహిస్తున్న పేకాట, కోడి పందేల శిబిరాలను గుర్తించడంలో డ్రోన్ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి.ప్రకాశం, మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 01.02.2026 నుండి ఇప్పటి వరకు 41 పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 189 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.4,82,394/- నగదును స్వాధీనం చేసుకున్నారు.అలాగే 10 కోడి పందేలు స్థావరాలపై దాడులు నిర్వహించి 84 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.2,10,180/- నగదు మరియు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై ఒక కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద 3 ల్యాప్‌టాప్‌లు, 21 సెల్ ఫోన్లు, రూ 24 లక్షల నగదు, ఇతర పరికరాలు మరియు 3 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. మట్కా నిర్వహిస్తున్న 5 స్థావరాలపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్ట్ చేసి రూ.15,760/- నగదును స్వాధీనం చేసుకున్నారు.పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ దుష్ప్రభావాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సుమారు 1500 మందికి పైగా యువత మరియు తల్లిదండ్రులకు చట్టపరమైన పరిణామాలు, ఆర్థిక నష్టాలు, కుటుంబాలపై ప్రభావం గురించి వివరించారు. యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ ప్రమాదాలను వివరించారు. తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పేకాట మరియు కోడి పందాలు ఆడే పాత ముద్దాయిలు, నిర్వాహకులను ముందస్తుగా 98 మందిని బైండోవర్ చేయడం జరిగింది.అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా నిర్వహించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. నేర నియంత్రణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద కదలికలను గమనించాలని సూచించారు.ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఏ సమాచారం తెలిసినా ప్రజలు వెంటనే డయల్ 112 లేదా పోలీసుల వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు