పిల్లల ఆకలి తీర్చిన వార్డు సభ్యుడు
గుల్లకోట పాఠశాలలో ప్రశంసనీయమైన చొరవ
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 30 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సోమవారం ఒక వినూత్న సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికుల మధ్య తలెత్తిన అంతర్గత కలహాల కారణంగా వంట ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు మధ్యాహ్న సమయానికి ఆకలితో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న 10వ వార్డు సభ్యులు మూల ప్రశాంత్ వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. కార్మికుల గొడవ వల్ల పిల్లలు ఆకలితో ఉండకూడదని భావించిన ఆయన, ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా రంగంలోకి దిగారు. పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో ప్రశాంత్ స్వయంగా ఆహారం తయారు చేపించి, విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను చాటుకోవడమే కాకుండా, మానవత్వాన్ని ప్రదర్శించిన మూల ప్రశాంత్ చొరవను గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. సమయస్ఫూర్తితో స్పందించి విద్యార్థుల ఆకలి తీర్చిన ప్రశాంత్‌ను పలువురు అభినందించారు.