పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.
భూసేకరణ నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులపై జిల్లా మంత్రులు సంబంధిత అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహించి, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.