గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక పారిశుధ్య మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ అలీం భాషా సోమవారం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.మంగళగిరి పట్టణంలోని షరాఫ్ బజార్,మార్కండేయ కాలనీలలో రోడ్ల పరిస్థితి,మురుగు కాలువల పారుదల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా డ్రైనేజీలలో ప్లాస్టిక్ కవర్లు,చెత్త వేయడం వల్ల కాలువలు మూసుకుపోతున్నాయని గుర్తించి,ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కవర్లు లేదా చెత్తను మురుగు కాలువల్లో వేయరాదని సూచించారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని,పరిశుభ్రతను కాపాడడంలో ప్రజలు భాగస్వాములు కావాలని తెలిపారు.అనంతరం లక్ష్మీనరసింహ స్వామి కాలనీలోని పార్కును సందర్శించి, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
పార్కులో పచ్చదనాన్ని సమర్థంగా నిర్వహించేందుకు,మొక్కలను సంరక్షించేందుకు,పార్కు పరిశుభ్రతను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు,తాగునీటి సౌకర్యం లైటింగ్ వంటి సౌకర్యాలను మెరుగుపరచాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అలాగే ఆత్మకూరులోని హెడ్ వాటర్ వర్క్స్‌ను తనిఖీ చేసి,నీటి సరఫరా వ్యవస్థను సమగ్రంగా పరిశీలించారు.వేసవి కాలంలో త్రాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని,ప్రతి వార్డులో త్రాగునీటి సరఫరా సమయపాలన ఖచ్చితంగా అమలు చేయాలని,నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టి,క్లోరినేషన్ మరియు నీటి పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పరశీలన లో నగర పాలక సంస్థ డీ ఈ ఈ రమేష్ బాబు.ఏ ఈ ప్రవీణ్,ఇంజినీరింగ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు