prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 3:54 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పాత కడప హరిజనవాడలో ప్రధాన డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయండి. సి.పి.ఎం

ప్రజావాణిన్యూస్(మార్చి16)కడపనగరం ఒకటో డివిజన్ పాత కడప హరిజనవాడలో చిన్న చిన్న కాలువలన్నీ కలిపి వెళ్ళే ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు.సోమవారం నాడు కడప నగర పాలక సంస్థ గ్రీవెన్స్ డే లో డిప్యూటీ కమిషనర్ రాంబాబుకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ పాత కడప హరిజనవాడ ఏర్పడి చాలా సంవత్సరాలు అయిందని,ఇప్పటివరకు ప్రధాన డ్రైనేజ్ కాలువ ఏర్పాటు చేయడం లేదన్నారు.ప్రధాన డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయకపోవడం వల్ల మురుగునీరు అంతా ఒకేచోట పేరుకుపోయి ప్రజలకు జబ్బులు వస్తున్నాయని ఆయన తెలిపారు.ఆ ప్రాంతమంతా విపరీతంగా దోమలు విలయతాండవం చేస్తున్నాయని ఆయన అన్నారు.మురుగునీరు పేరుకు పోవడం వల్ల చిన్న పిల్లలు, మహిళలు,వృద్దులు జబ్బుల బారిన పడుతున్నారని ఆయన అన్నారు.దీనికోసం లక్షలాధి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆయన వివరించారు.ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు అక్కడ మురుగునీరు నిలువ ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉందన్నారు.ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే కడప కార్పొరేషన్ అధికారులు ప్రధాన మురికి కాలువను తీసి తద్వారా వృధా నీటిని పంపేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమస్య పరిష్కారం చేయాలని గతంలో ఉన్న కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేస్తే సంబంధిత ఇంజనీర్లు పరిశీలించమని ఆదేశించారని ఆయన తెలిపారు.కానీ ప్రస్తుతం కమిషనర్,ఆ డివిజన్ ఇంజినీర్ ఇద్దరు అధికారులు బదిలీ అయ్యారని సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని,లేని పక్షంలో ప్రజానీకాన్నీ కలుపుకొని సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడుతుందని ఆయన హెచ్చరించారు.ఈ పోరాటానికి ప్రజానీకం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు దస్తగిరిరెడ్డి రామకృష్ణారెడ్డి,నరసింహ తదితరులు పాల్గొన్నారు .