prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 7:02 am Digital Edition : PRAJA VANI

పంటల అవశేషాలు కాల్చవద్దు

*పంటల అవశేషాలు కాల్చవద్దు*

*మండల వ్యవసాయ అధికారిని జి కిరణ్మయి*

* *మన ప్రజావాణి*, *మందమర్రి రూరల్*:- మే 27

వివిధ పంట కోతల అనంతరం పంట అవశేషాలను రైతులు కాలుస్తున్నారని, అలా చేయకుండా వాటిని నేలలోనే కలియ దున్నాలని మండల వ్యవసాయ అధికారిని జి కిరణ్మయి సూచించారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ  పంట అవశేషాలు కాల్చడం వలన భూ వాతావరణం వేడెక్కి, భూమిలో ఉండే వివిధ రకాలైన మేలు చేసే సూక్ష్మ జీవులు నశించి, వాటి చర్యలు లేని కారణంగా సేంద్రియ కర్బన శాతం తగ్గడమే కాకుండా, భూమి గట్టిపడి, వివిధ రకాల పంటల వేరు వ్యవస్థకు అడ్డంకిగా మారుతుందని తెలిపారు. అదేవిధంగా భూమి సారం దెబ్బతిని, మృత నేలగా మారుతుందని, పంటల అవశేషాలు కాల్చడంతో వాతావరణ కలుషితం కావడమే కాకుండా ఓజోన్ పొర దెబ్బతిని అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమి పైకి రావడంతో సమస్త జీవ కోటికి నష్టం జరుగుతుందని, వివిధ రకాల క్యాన్సర్లు మానవాళికి సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. అదేవిధంగా దట్టమైన పొగ మంచు ఏర్పడడంతో రవాణా సౌకర్యం దెబ్బతింటుందని, ఇలా చేసే క్రమంలో కొన్ని సందర్భాల్లో రైతులు సైతం మంటలతో ప్రమాదాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఎట్టి పరిస్థితిలో పంట అవశేషాలు కాల్చవద్దని ముఖ్యంగా వరికోయలు  పత్తి కట్టే కాల్చకుండా యంత్రాల సహాయంతో ముక్కలుగా చేసి, భూముల్లో కలియ దున్ని, సింగిల్ సూపర్ ఫాస్పేట్ ను నేలకు అందించడం వల్ల బాగా మురిగి భూమిలో పాటు పెరుగుతుందని వివరించారు. దీంతో అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని తెలిపారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 223, 287 లను అనుసరించి రైతులు ఎవరైనా రెండు ఎకరాల లోపు భూమిలో అవశేషాలు కాల్చినప్పుడు ఐదువేల రూపాయల వరకు జరిమానా, రెండు నుంచి ఐదు ఎకరాల లోపు భూమిలో పంట అవశేషాలు కాల్చినప్పుడు పదివేల రూపాయల వరకు జరిమానా, 5 ఎకరాలకు పై పంట అవశేషాలు కాల్చినప్పుడు 30 వేల వరకు జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని వివరించారు. రైతులు పంట అవశేషాలు కాల్చకుండా నెలలోనే కలియ దున్ని భూసార పెరుగుదలకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, వెంకటాపూర్, లేమూరు శివారు రైతులు పాల్గొన్నారు.