prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 9:37 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్న భూ దోపిడీ,,నకిలీ పత్రాలతో కోట్ల విలువైన పట్టా భూమి అక్రమ రిజిస్ట్రేషన్

నెల్లూరు మే17 ప్రజావాణి కోట పట్టణ కేంద్రంలో నకిలీ పత్రాలతో కోట్ల విలువైన పట్టా భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పట్టాదారుకు తెలియకుండా 2014 నాటి ఫేక్ అగ్రిమెంట్‌తో కోటలో భారీ భూదందా వెలుగులోకి యజమాని ప్రమేయం,వారసుల సాక్ష్యాలు లేకుండానే సర్వే నెంబర్ 1241-1 లో రిజిస్ట్రేషన్ పర్వం.మొత్తం 96 అంకణాల భూమిని రెండు భాగాలుగా విభజించి,ఒక్కోటి 48 అంకణాల చొప్పున వేర్వేరుగా రెండు అక్రమ రిజిస్ట్రేషన్లు పూర్తి.రెండింటికీ ఫేక్ స్కెచ్‌ల వాడకం. అగ్రిమెంట్‌ నాటికి పట్టాదారు బ్రతికున్నా.రిజిస్ట్రేషన్ల సమయానికి మృతి చెందడంతో వారసులు లేని తరుణం చూసి అక్రమాలు.అగ్రిమెంట్‌లోలోని సంతకం అసలు పట్టాదారుది కాదని ఆయన శ్రేయోభిలాషుల స్పష్టీకరణ.అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌తోనే రూ.15.36 లక్షల విలువైన ఆస్తిని ప్రేమ కానుక పేరిట ప్రతిఫల రహిత సెటిల్మెంట్‌గా మార్పిడి.నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఒక భూమి రిజిస్ట్రేషన్ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.ప్రభుత్వ నియమ నిబంధనలను,రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తిగా తుంగలో తొక్కేస్తూ కొందరు వ్యక్తులు సాగించిన ఈ లీలలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనితీరును తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి.సర్వే నెంబర్ 1241-1 లో ఉన్న ఒకరి పట్టా భూమిని ఎటువంటి ప్రామాణికత పాటించకుండా అత్యంత తృణప్రాయంగా పరాయి వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేయడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు భూ యజమానికి చెందిన 1బీ అడంగల్ రికార్డులతో ప్రమేయం లేకుండా,ఆయనకు కానీ ఆయన కుటుంబీకులకు కానీ కనీస సమాచారం ఇవ్వకుండా 2014 సంవత్సరంలో ఒక ఫేక్ అగ్రిమెంట్ డాక్యుమెంట్‌ను సృష్టించి ముందస్తు వ్యూహంతో ఈ దందాకు తెరలేపారు.ఈ అక్రమ వ్యవహారంలో భూమి విస్తీర్ణం,దానికి సృష్టించిన డాక్యుమెంట్లు పక్కా వ్యూహంతో రూపొందించినట్లు తెలుస్తోంది.మొత్తం 96 అంకణాల (768 గజాలు) స్థలాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు నిందితులు అన్ రిజిస్టర్డ్ పత్రాలను ఆశ్రయించడమే కాకుండా,భూమిని రెండు భాగాలుగా విభజించి,ఒక్కోటి 48 అంకణాల (384 గజాలు) చొప్పున వేర్వేరుగా రెండు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ఈ రెండు రిజిస్ట్రేషన్ల కోసమూ పూర్తిగా నకిలీ స్కెచ్‌లను ఉపయోగించడం వారి పక్కా వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది.సదరు ఫేక్ అగ్రిమెంట్‌ను ఆధారంగా చేసుకుని,ఆ ఆస్తిని తనకు వరుసకు కుమారుడు అయిన వ్యక్తికి ప్రేమానురాగముల వలన భవిష్యత్తులో సుఖముగా జీవించునందులకు బహుమతిగా ఇస్తున్నట్లు పత్రాలు రాయించి,రూ.15,36,000 విలువ గల ఈ మొత్తం ఆస్తిని ప్రేమనే ప్రతిఫలంగా భావించి, ఏప్రిల్ 28వ తేదీన ప్రతిఫల రహిత సెటిల్మెంట్‌గా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్వాధీనం చేసినట్లు రికార్డుల్లో చూపించారు.ఈ కథనంలో శోధిస్తే ఎన్నో లొసుగులు,తప్పులు స్పష్టంగా బయటపడుతున్నాయి. 2014లో ఈ నకిలీ అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ రాసే నాటికి అసలు పట్టాదారు బ్రతికే ఉన్నప్పటికీ తదనంతర కాలంలో ఆయన మరణించారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పట్టాదారు మరణించిన తర్వాతే తెరపైకి తెచ్చి ముగించడం ఇక్కడి అసలు ట్విస్ట్.సాధారణంగా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయకూడదనే ప్రాథమిక నియమాన్ని ఇక్కడ పూర్తిగా విస్మరించారు.పట్టాదారు చనిపోవడంతో,కుటుంబ సభ్యులు లేదా వారసుల సాక్ష్యాలు కానీ ప్రమేయం కానీ లేకుండానే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసేశారు. అగ్రిమెంట్‌లో ఉన్న సంతకం అసలు పట్టాదారు సంతకంతో ఎక్కడా పొంతన లేదని,అది ముమ్మాటికీ నకిలీదేనని పట్టాదారు శ్రేయోభిలాషులు బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు.ఇంతటి ఘోరమైన అక్రమం రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఎలా సాధ్యమైందనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.పట్టాదారు మరణించిన తర్వాత,ఆయనకు వారసులు ఉన్నప్పటికీ వారి ప్రమేయం లేకుండా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా ముగించారనేది తలపండిన ఉద్యోగులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ నకిలీ దందా వెనుక డాక్యుమెంట్ రైటర్లు ఉండి నడిపించారా లేక రిజిస్టర్ చేయించుకున్న వారే అధికారుల చేతులు తడిపి ఈ అక్రమాలకు ఒడిగట్టారా అనే కోణంలో ఆరా తీయాల్సి ఉంది.ఇలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఇంకెన్ని జరిగాయోనని స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుంటున్నారు