ప్రజావాణిన్యూస్(మార్చి22)ప్రపంచ నీటి దినోత్సవం తెల్లవారుజామున నాలుగు గంటలు.ఇంకా చీకటి వీడలేదు.ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఆమె నిద్ర లేచింది.ఆమె మొదటి పని–కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి బావికి పయనం.తలపై కుండ,చేతిలో పిల్లవాడు.ఈ చిత్రం భారత దేశంలోనే కాదు,ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళల దైనందిన జీవితం అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల మంది ప్రజలకు ఇంటి ఆవరణలో తాగునీరు అందుబాటులో లేదు.ఈ పరిస్థితిలో మూడింట రెండు వంతుల కుటుంబాల్లో నీటి సేకరణ బాధ్యత మహిళలదే. 53 దేశాల్లోని గణాంకాలు చెప్పేదేమిటంటే,మహిళలు,బాలికలు అందరూ కలిసి ప్రతిరోజూ నీటి కోసం కేటాయించే గంటలను లెక్కిస్తే.25 కోట్ల గంటలు కేటాయిస్తున్నట్లు తేలింది.ఇది పురుషులు,బాలురు కేటాయించే సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ.ఇన్నేళ్ల ప్రపంచాభివృద్ధిలో నేటికీ తాగునీటికి కటకటలాడే పరిస్థితి.ఇప్పుడు వేసవికాలం.ఈ సమస్య మరింత జఠిలంగా మారుతుంది.మార్చి 22వ తేదీ ప్రపంచ నీటి దినోత్సవం”సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.మంచినీటి సమస్య అనేది మహిళల వెతలు,అసమానతలకు అద్దం పడుతోంది. నీటి కోసం మహిళలు పడే ఈ వెతలు వారిని అనేక రకాల అసమానతలకు గురిచేస్తున్నాయి.అందులో విద్యాపరమైన అసమానత ఒకటి.నీటి కోసం గంటల కొద్దీ ప్రయాణించాల్సి రావడంతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు.పాఠశాలకు వెళ్లాల్సిన వాళ్ల రోజంతా నీటి వెతుకులాటలోనే గడిచిపోతోంది. ఆరోగ్యపరమైన ప్రభావం రెండోది.నీటి భారాన్ని మోస్తూ కిలోమీటర్లు నడవడం వల్ల వెన్నునొప్పి,గర్భసంబంధ సమస్యలు,ఇతర శారీరక సమస్యలు మహిళలను వెంటాడుతున్నాయి. అంతేకాదు, కలుషిత నీటి వల్ల ప్రతిరోజూ ఐదేళ్ల లోపు 1,000 మంది పిల్లలు మరణిస్తున్నారు.శరీరానికి అవసరమైనంత నీటిని తాగకపోవడం వల్ల మరెన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.అంతేకాదు ఈ నీటి సమస్య ఆర్థిక అసమానతల్ని పెంచుతోందంటే నమ్ముతారా?అవుననే సమాధానం వస్తుంది.ఎందుచేతనంటే నీటి కోసం గంటలు గంటలు వెచ్చించడం వల్ల మహిళలు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.ఇది వారిని ఆర్థికంగా అట్టడుగుకు నెట్టేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా రాజకీయ అసమానతలను పెంచుతోందంటే ఆశ్చర్యపోవాల్సిందే.నీటి నిర్వహణ, నిర్ణయాధికారంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ.ప్రపంచంలోని 14% దేశాల్లో మాత్రమే నీటి నిర్వహణలో మహిళల భాగస్వామ్యానికి యంత్రాంగాలు ఉన్నాయి.ప్రపంచ దేశాల్లో.ప్రపంచంలోని వివిధ దేశాలు నీటి సమస్యను వివిధ రకాలుగా ఎదుర్కొంటున్నాయి.చైనా ఆదర్శనీయం.ప్రపంచ జనాభాలో 20% ఉన్న చైనా వద్ద మొత్తం మంచినీటి వనరుల్లో 6% మాత్రమే ఉంది. చైనాలో నీటి లభ్యత ప్రపంచ సగటు కంటే 75% తక్కువ.చైనా ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు–దక్షిణ-ఉత్తర నీటి బదిలీ ప్రాజెక్టు 1950లలో ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు 2050 నాటికి పూర్తవుతుంది.ఇప్పటి వరకు దీనికి 6,200 కోట్ల డాలర్లు వెచ్చించారు,ఇది త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రాజెక్టు కంటే దాదాపు రెట్టింపు. తూర్పు మార్గం,మధ్య మార్గం.ఇవి 2013,2014లోనే ప్రారంభమయ్యాయి.ప్రతి సంవత్సరం 2,090 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని దక్షిణం నుంచి ఉత్తరానికి తరలిస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ,సామాజిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.దాదాపు 3,30,000 మంది నిర్వాసితులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాకే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.సింగపూర్:నాలుగు కుళాయిల వ్యూహంతో నీటి సమస్యను పరిష్కరించుకుంటోంది.స్థానిక జలాశయాలు,మలేషియా నుంచి దిగుమతి,అధునాతన శుద్ధి చేసిన నీరు సముద్ర జలాన్ని మంచినీటిగా మార్చడం.ఆస్ట్రేలియా:వర్షపు నీటి సంరక్షణ,భూగర్భ జలాల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది.మెల్‌బోర్న్ నగరంలో వర్షపు నీటి సేకరణ తప్పనిసరి.
ఇజ్రాయెల్: నీటి కొరత అత్యధికంగా ఉన్న దేశం ఇది.కానీ సముద్ర జలాన్ని మంచినీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్లు,వ్యర్థజల శుద్ధి,పునర్వినియోగం ద్వారా నీటి సమస్యను అధిగమిస్తోంది. వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులతో నీటి వినియోగాన్ని 70%తగ్గించింది,
మనదేశంలో.భారతదేశంలో నీటి సమస్య బహుముఖంగా ఉంది. 70% కంటే ఎక్కువ మురుగునీరు శుద్ధి చేయకుండానే నదులు,సముద్రాల్లో కలుస్తోంది. దీనివల్ల దేశంలోని మూడు నుంచి నాలుగు వంతుల నీటి వనరులు కలుషితమవుతున్నాయి.మన దేశంలో 21% కంటే ఎక్కువ వ్యాధులు నీటి సంబంధితమైనవి.ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు ప్రధానకారణం కలుషిత నీరు,పరిశుభ్రత లోపం.తెలంగాణలో.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. కష్ణా, గోదావరి నదుల నీటి పంపకమే ఇందుకు ప్రధాన కారణం. చారిత్రకంగా చూస్తే, బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకంలో అనుభవదారు హక్కు ప్రాతిపదికగా తీసుకోవడంతో తెలంగాణకు నష్టం జరిగిందనే వాదన ఉంది.ఏది ఏమైనా ఉమ్మడి రాష్ట్రంలో ఆయా ప్రాంతాలకి సరైన ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల నీటి వాటా దక్కలేదన్నది వాస్తవం.మహబూబ్‌నగర్,రంగారెడ్డి జిల్లాలు సాగు నీరు లేక వలసల జిల్లాలుగా మారాయి.ఇక్కడి భూములు సాగునీటికి నోచుకోక,ఆక్రమణలకు,కొనుగోళ్లకు గురయ్యాయి.ఇప్పటికైనా నదీ జలాల పంపకంలో న్యాయమైన ప్రాతిపదిక ఉండాలి.ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక చర్చలు జరపాలి. చెరువులు,కుంటల పునరుద్ధరణ చేయాలి.ప్రత్యామ్నాయ నీటి వనరుల అభివద్ధి చేపట్టాలి.కేరళలో.కేరళకు భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం ఉన్నప్పటికీ,ఫిబ్రవరి-మే మధ్య తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది.భౌగోళిక నిర్మాణం, వేగవంతమైన పారుదల,పెరిగిన కాలుష్యం ఇందుకు కారణాలు.ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలు పరిశీలిస్తే.
న జలనిధి ప్రాజెక్టు ఒకటి.ప్రపంచ బ్యాంకు సాయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆధారిత నీటి సరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేశారు.వర్షపు నీటి సంరక్షణ తప్పనిసరి. అన్ని కొత్త భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ తప్పనిసరి చేశారు.స్థానిక జల వనరుల పునరుద్ధరణ చేపట్టారు.చెరువులు,బావుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమం.జన భాగస్వామ్యం ప్రధానం. నీటి నిర్వహణలో స్థానిక సంఘాలు,మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం.పర్యావరణం.. ప్రభావాలు.నీటి సమస్యకు పర్యావరణ కోణం చాలా లోతైనది. వాతావరణ మార్పులు,అతివృష్టి-అనావృష్టి,హిమానీనదాల కరుగుదల అన్నీ పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి.
చైనాలోని టిబెటన్ పీఠభూమి ”మూడవ ధవం”అని పిలువబడే ప్రాంతం.గత అర్ధ శతాబ్దంలో 3-3.5 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది.దీనివల్ల హిమనీనదాలు వేగంగా కరుగుతున్నాయి.1950ల నుంచి 82% హిమనీనదాలు వెనక్కి మళ్లాయి. 20% కంటే ఎక్కువ మంచు కప్పబడటంతో అదృశ్యమైంది.
యాంగ్జీ నదిలో హిమానీనదాల ప్రవాహం 1990ల నుంచి 13.9% తగ్గింది.2030 నాటికి ఇది మరింత తీవ్రమవుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.పర్యావరణ వ్యవస్థలకు నీరు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి.ఒక చెట్టు బతకడానికి,ఒక చేప జీవించడానికి,ఒక పక్షి ఆహారం సంపాదించుకోవడానికి నీరు తప్పనిసరి.నీటి వనరులు కలుషితమైనప్పుడు, ఎండిపోయినప్పుడు మొత్తం పర్యావరణ వ్యవస్థ కుప్పకూలుతుంది.గిరిజనుల నీటి వెతలు.ఇప్పటివరకూ మాట్లాడుకున్న సమస్యలు ఒక ఎత్తు.గిరిజన ప్రాంత ప్రజల నీటి వెతలు మరో ఎత్తు.గిరిజన ప్రాంతాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. కొండ ప్రాంతాలు,అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు మౌలిక సదుపాయాలు చేరవు.నీటి కోసం వారు పడే వెతలు అపారం.మధ్యప్రదేశ్‌లోని బైగా గిరిజనులకు వర్షాకాలంలో మాత్రమే నీరు అందుబాటులో ఉంటుంది. మిగిలిన కాలం కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకోవాల్సిందే.ఒడిశాలోని దొంగరియా కొండ గిరిజనులు కొండలపై నివసిస్తారు.వీరికి నీటి వనరులు చాలా దూరంలో ఉంటాయి.మహిళలు, పిల్లలు ప్రతిరోజూ 4-5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది.పరిష్కారాలు:గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి సంరక్షణ నిర్మాణాలు.వర్షపు నీటి సంరక్షణకు ప్రోత్సాహం.గిరిజనుల భాగస్వామ్యంతో నీటి ప్రాజెక్టులు.
సాంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతుల పునరుద్ధరణ.నీటి వనరుల చుట్టూ హక్కుల రక్షణ.ఆంధ్రప్రదేశ్‌లో.నీటి పారుదల విధానాలు.వాగ్దానాలకు,వాస్తవాలకు మధ్య అగాధం.
అది సెప్టెంబర్ 2025. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు విపక్షాలను,మీడియాను,ప్రజలను ఉర్రూతలూగించాయి.”రాష్ట్రాన్ని కరవు రహితంగా మారుస్తాం. రూ.70,000 కోట్లతో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నదులన్నింటినీ అనుసంధానం చేస్తాం.” ఈ మాటలు వింటుంటే ఆంధ్రప్రదేశ్ రైతుల కళ్లలో ఆశల దీపాలు వెలిగాయి. ముఖ్యంగా రాయలసీమ రైతులకు ఈ మాటలు అమృతం లాంటివి. ఎందుకంటే వారి భూమి నీటి కోసం ఎన్నో ఏళ్లుగా తపించిపోతోంది.కానీ ఈ వాగ్దానాలు, ప్రణాళికలను కాస్త లోతుగా పరిశీలిస్తే కొన్ని ప్రశ్నలు,కొన్ని సందేహాలు తలెత్తకమానవు. పోలవరం ప్రాజెక్టు ఎన్నిసార్లు గడువు మీరింది?నదుల అనుసంధానం వల్ల పర్యావరణానికి ఏమవుతుంది? రాయలసీమకు నీరు నిజంగా అందుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతకడానికి ఒక చిన్న ప్రయత్నం.గతం నేర్పిన పాఠాలు.చరిత్ర మనకు ఒక విషయం నేర్పిస్తుంది. ఎన్నికల సమయంలో వచ్చే వాగ్దానాలు, ప్రకటనలు చాలావరకు కాగితాలకే పరిమితమవుతాయి.2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నీటి పారుదలపై రూ.68,417 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి రూ.70,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. అంటే దాదాపు అదే మొత్తం.కానీ ఈ సారి పరిస్థితులు వేరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కరోనా, ప్రకృతి విపత్తులు,ఇతర అనివార్య ఖర్చులు – వీటన్నింటి మధ్య ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యమేనా?నిధుల కోసం కేంద్రంపై ఆధారపడక తప్పదు.కేంద్రం ఎంతవరకు సహకరిస్తుందో చెప్పలేం.ఒక్క ఏడాదిలో రూ.12,454 కోట్లు ఖర్చు చేశారని సీఎం చెప్పారు.ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు చేసిన రూ.28,376 కోట్ల కంటే ఎక్కువే.కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి.గత ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కొంది. ఆ సమయంలో అన్ని శాఖలకూ నిధులు కుదించాల్సి వచ్చింది. అంతేకాదు,కేవలం ఖర్చు చేసిన మొత్తం ముఖ్యం కాదు. ఆ ఖర్చు వల్ల ఎంతమంది రైతులకు నీరు అందింది?ఎన్ని ఎకరాల సాగు పెరిగింది,అనేది కూడా చూడాలి. ఇప్పటివరకు ఈ గణాంకాలు మాత్రం అందుబాటులో లేవు.పోలవరం నాటకం,పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పుకోవాలంటే ఒక నాటకం గుర్తుకు వస్తుంది.ఎన్నిసార్లు పునర్జన్మ ఎత్తినా చివరకు హీరో చేతిలో చనిపోయే ఓ విలన్‌లాగా ఈ ప్రాజెక్టు కనిపిస్తుంది.86 శాతం సివిల్ వర్క్స్ పూర్తయ్యాయని,డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఇవే మాటలు ఎన్నిసార్లు విన్నాం? గత తెలుగుదేశం ప్రభుత్వం 2019 నాటికి 72 శాతం పనులు పూర్తి చేసింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 14 శాతం మాత్రమే పనులు పూర్తి చేసింది.ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2027 నాటికి పూర్తి చేస్తామంటోంది.ఇంతకీ ఈ ప్రాజెక్టుకు అసలు సమస్య ఏమిటి? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడమే ప్రధాన సమస్య. రూ.400 కోట్లతో నిర్మించిన ఈ గోడ కొట్టుకుపోవడానికి కారణం ఏమిటి? నిర్మాణంలో లోపాలా?సహజ విపత్తా? లేక నిర్వహణ లోపాలా? దీనిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఇప్పుడు దాన్ని మళ్లీ నిర్మించడానికి రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం ఖర్చు ఇంకా పెరుగుతూనే ఉంది.ఫిబ్రవరి 2026లో సీఎం ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. పోలవరం ఫేజ్-2కు రూ.32,000 కోట్లు కేటాయించాలని కోరారు.భూసేకరణ,పునరావాసం,రక్షిత కట్టల నిర్మాణానికి ఈ నిధులు అవసరమట.ఇప్పటివరకు ఖర్చు చేసిందంతా ఫేజ్-1కేనా? అంటే ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు.
నదుల అనుసంధానం.స్వప్నమా ?సాధ్యమా ?నలభై నదులను అనుసంధానించాలని,గోదావరి-కష్ణా వరద నీటిని సముద్రంలో కలవకుండా నిల్వ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.ఇది వింటే చాలా గొప్పగా, సాహసోపేతంగా అనిపిస్తుంది.కానీ ఇలాంటి ప్రాజెక్టులు ప్రపంచంలో ఎక్కడైనా విజయవంతమయ్యాయా?మన దగ్గర అన్నమయ్య జిల్లాలో చిన్న స్థాయిలో సబ్-బేసిన్ల అనుసంధానం విజయవంతమైంది. కానీ అది 40 నదుల అనుసంధానం కాదు.అది ఒక జిల్లా పరిధిలో చిన్న చిన్న వాగులు,కాలువల అనుసంధానం. ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టే ముందు పర్యావరణ ప్రభావ అంచనా తప్పనిసరి.ఇప్పటివరకు అలాంటి అంచనా ఏదీ జరిగినట్లు లేదు.థీమ్.ప్రతి సంవత్సరం ఈ రోజు మనకు గుర్తు చేసేది ఒక్కటే –నీరు కేవలం జీవనాధారం మాత్రమే కాదు,అది హక్కు.2026 ప్రపంచ నీటి దినోత్సవ థీమ్ నీరు మరియు లింగ సమానత్వంః ఐక్యరాజ్యసమితి ప్రకారం ఈ సంవత్సరం నినాదం: నీరు ప్రవహించే చోట,సమానత్వం పెరుగుతుంది.రాయలసీమకు నీరు.. ఒక అనంత కథరాయలసీమ అంటేనే కరువు, నీటి కొరత. అక్కడి రైతులు నీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు,అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్,గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) కడప వరకు వంటి ప్రాజెక్టులకు రూ.7,853 కోట్లు కేటాయించారు.ఇవి రాయలసీమకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.గతంలో హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా 738 కి.మీ.కాలువలు నిర్మించి కష్ణా నీటిని కుప్పం వరకు తీసుకెళ్లడం పెద్ద విజయమే.కానీ ఈ ప్రాజెక్టుల నిర్వహణ,చివరి వరకు నీరు అందేలా చూడటం ఇవి సవాళ్లే.కొన్ని చోట్ల కాలువలు నిర్మించారు.కానీ, వాటి ద్వారా నీరు ప్రవహించడం లేదు.కొన్నిచోట్ల నీరు వచ్చినా,పంపిణీలో సమస్యలు.రైతుల మధ్య విభేదాలు,రాజకీయ జోక్యం –ఇవన్నీ పంపిణీని ప్రభావితం చేస్తున్నాయి.ఇన్ని సమస్యల మధ్య అన్నమయ్య జిల్లా మాత్రం ఒక వెలుగులా కనిపిస్తోంది.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతత్వంలోని ”ప్రాజెక్ట్ జలధార”నిజంగా అభినందనీయం.6,000 పనిచేయని ఫీడర్ కాలువల్లో 4,000 పునరుద్ధరణ చేశారు.310 కొత్త ఫీడర్ కాలువలు తవ్వారు.214 వ్యవసాయ కుంటలు నిర్మించారు.532 స్థానిక వాగులు, 3,089 చెరువులు పునరుద్ధరించారు.ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. భూగర్భ జలాలు సగటు 14.45 మీటర్ల నుండి 3-8 మీటర్లకు చేరాయి.20,000 పాడైపోయిన బోర్వెల్లు పునరుద్ధరించబడ్డాయి. హార్టికల్చర్ 20,000 హెక్టార్లు పెరిగి 85,760 హెక్టార్లకు చేరింది.రూ.1,634 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.ఈ విజయం ఏం చెప్తోంది? పెద్ద ప్రాజెక్టులు మాత్రమే కాదు,చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పు తీసుకురాగలవు.ఒక జిల్లా కలెక్టర్ చొరవ,స్థానిక ప్రజల భాగస్వామ్యం,సమన్వయంతో ఇంత పెద్ద మార్పు సాధ్యమైంది.ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలిగితే,నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకవచ్చు.ఉత్తరాంధ్ర ప్రాజెక్టులలో ఇంకా ప్రారంభం కాని పనులు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితి వేరు.బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు (ఫేజ్-2, స్టేజ్-2),హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నాగావళి-చంపావతి నదుల అనుసంధానం వంటి తొమ్మిది ప్రాజెక్టులకు రూ.2,098 కోట్లు కేటాయించారు. 4.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం.నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిన మాటలు గమనించాలి.ఉత్తరాంధ్ర జిల్లాల్లో 20-30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.వచ్చే ఏడాది ఈ పనులు ప్రారంభిస్తాం.”అంటే ఇంకా కొంతకాలం ఆగాల్సిందేనా? రైతులు మరెన్ని ఏళ్లు ఎదురుచూడాలి?ఇదే ప్రశ్న.ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలు,వాగ్దానాలు కాగితాలకే పరిమితం కాకుండా,నేలపై అమలు కావాలి.అప్పుడే రాష్ట్రం నిజంగా కరవు రహితంగా మారుతుంది. రైతులకు సరైన సమయంలో సరైన మోతాదులో నీరు అందుతుంది.ప్రతి ఇంటికి తాగునీరు చేరుతుంది. ఇదే నిజమైన అభివద్ధి. ఇదే నిజమైన స్వరాజ్యం. ప్రపంచ నీటి దినోత్సవం 2026 నినాదం మర్చిపోవద్దు.”నీరు ప్రవహించే చోట,సమానత్వం పెరుగుతుంది.”ఆంధ్రప్రదేశ్లో నీరు ప్రవహించాలి.ప్రతి పొలానికి,ప్రతి ఇంటికీ. అప్పుడే సమానత్వం పెరుగుతుంది. అప్పుడే రాష్ట్రం అభివద్ధి చెందుతుంది.