పోచారం, జూలై 23: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొమ్మక అజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజ్జు, రాష్ట్ర కార్యదర్శి చంద్రిక, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి బండ్లగూడ క్రాంతి గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మేడ్చల్ అసెంబ్లీ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆకిటి యుగేందర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసి, వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బొమ్మక అజయ్ మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలో పేపర్ లీక్ జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పరీక్షల పారదర్శకతను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి శరత్, మండల, మున్సిపల్ అధ్యక్షులు సంజీవరెడ్డి, వినయ్, అజయ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, అఖిలేష్ రెడ్డి, బొడిగె సాయి గౌడ్, వంశీ, వెంకట్, రవి, సాయి, ధనరాజ్, సందీప్, రమేష్‌తో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
