నసుల్లాబాద్ మండలంలో “టైం బ్యాంకింగ్” పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం
ప్రజావాణి ప్రతినిధి, కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలో గ్రామీణాభివృద్ధి, యువత సేవాభావం, స్వచ్ఛంద సేవా సంస్కృతి మరియు పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో “టైం బ్యాంకింగ్ (Time Banking)” పైలెట్ ప్రాజెక్టు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు.
ట్రస్ట్ ప్రతినిధుల వివరాల ప్రకారం, ఈ పైలెట్ ప్రాజెక్టును తొలి దశలో నసుల్లాబాద్ మండలంలో అమలు చేసి, అనంతరం కామారెడ్డి జిల్లాలో మరో రెండు మండలాలు, నిజామాబాద్ జిల్లాలో మరో రెండు మండలాలకు విస్తరించే కార్యాచరణ రూపొందించారు.
ప్రాజెక్టులో భాగంగా నసుల్లాబాద్ మండల పరిధిలోని అంకోల్ తాండా, అంకోల్ గ్రామం, అంకోల్ క్యాంపు, నెమలి గ్రామం, నాచుపల్లి గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రాజెక్టు వివరాలతో కూడిన అవగాహన పత్రాలను అందజేసి, గ్రామస్థాయిలో అమలుకు సహకారం అందించాలని కోరారు.
టైం బ్యాంకింగ్ అంటే ఏమిటి?
టైం బ్యాంకింగ్ అనేది డబ్బుకు బదులుగా సమయాన్ని సేవగా గుర్తించే వినూత్న సామాజిక వ్యవస్థ. ఒక వ్యక్తి సమాజానికి అందించిన సేవను గంటల రూపంలో నమోదు చేసి, భవిష్యత్తులో అవసరమైన సమయంలో అదే విలువైన సేవను ఇతర సభ్యుల నుంచి పొందే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తుంది.
పైలెట్ ప్రాజెక్టులో చేపట్టనున్న కార్యక్రమాలు:
టైం బ్యాంక్ సభ్యుల నమోదు
టైం బ్యాంక్ వాలంటీర్ల నియామకం
గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు
సభ్యత్వ నమోదు కార్యక్రమాలు
చెట్ల నాటకం, సంరక్షణ
గ్రామ పరిశుభ్రత కార్యక్రమాలు
వృద్ధులకు సహాయక సేవలు
రైతులకు వ్యవసాయ సహాయం
విద్యార్థులకు ఉచిత విద్యా సహాయం
నీటి సంరక్షణ కార్యక్రమాలు
ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించి, యువత, మహిళలు, రైతులు, స్వచ్ఛంద సేవకులను టైం బ్యాంక్ వాలంటీర్లుగా నమోదు చేయడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.
ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని మరిన్ని మండలాలు, గ్రామ పంచాయతీలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు.
విడుదల చేసినవారు:రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్
ప్రతినిధులు:
శ్రీ మామిడి సాయిబాబా – అధ్యక్షులు
శ్రీ కత్తి గోపి – ప్రధాన కార్యదర్శి