prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 11:36 am Digital Edition : RAKESH PEDDAPALLY

నరకప్రాయంగా ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్లు!

 

• అపరిశుభ్రతకు నిలయాలుగా మారిన టాయిలెట్లు

• దుర్వాసనతో రోగులు ఇబ్బంది పడుతున్న వైనం

 

సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన.. రోగాలు కొనితెచ్చుకోవాల్సిందేనా?

 

గోదావరిఖని, జూలై 28  ప్రజావాణి:

స్థానిక గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కరువ వడమే కాకుండా, పరిశుభ్రత పూర్తిగా గాలి కొదిలేశారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు (టాయిలెట్లు) అత్యంత దారుణమైన స్థితికి చేరుకున్నాయి. సక్రమంగా క్లీనింగ్ చేయకపోవడం, నీటి వసతి లేకపోవడంతో మరుగుదొడ్లన్నీ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

**దుర్వాసనతో నరక దర్శనం:**

ఆసుపత్రిలోని టాయిలెట్లు క్లీన్ చేయక రోజులవుతుండటంతో వార్డుల వరకు దుర్వాసన వస్తోందని రోగులు వాపోతున్నారు. కమోడ్‌లు సరిగ్గా ఫ్లష్ చేయకపోవడం, పేరుకుపోయిన మురికితో అవి చూడటానికే అసహ్యం కలిగించేలా ఉన్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే, ఇక్కడి అపరిశుభ్ర వాతావరణం వల్ల కొత్త రోగాలు సంక్రమించే ప్రమాదం ఉందని రోగుల బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రోగులు, గర్భిణీల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.

**నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది:**

సఫాయి సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు. మరుగుదొడ్ల నిర్వహణపై సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్య సమాధానాలు ఇస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

**ఉన్నతాధికారులు స్పందించాలి:**

ఒకవైపు ప్రభుత్వం ఆసుపత్రుల్లో పారిశుధ్యానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో మరుగుదొడ్లను శుభ్రం చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.