నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
ఎల్లారెడ్డిపేట సీఐ ఓ వెంకటేష్
ప్రజావాణి, ఎల్లారెడ్దిపేట్
రైతులను మోసం చేసే విధంగా నకిలీ, నాసిరకం లేదా అనుమతి లేని విత్తనాలను విక్రయించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేష్ హెచ్చరించారు.
ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు విత్తనాల దుకాణాలను సీఐ ఓ. వెంకటేష్ , ఎస్సై రాహుల్ రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల లైసెన్సులు, విత్తనాల స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు బిల్లులు, విక్రయాల రికార్డులు, బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు తదితర వివరాలను పరిశీలించారు.
అనంతరం సీఐ గ మాట్లాడుతూ, నకిలీ లేదా నాసిరకం విత్తనాలను విక్రయించడం, నిల్వ చేయడం లేదా పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని స్పష్టం చేశారు.
దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లైసెన్స్ పొందిన సంస్థల విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ప్రతి విక్రయానికి రైతులకు బిల్లు ఇవ్వాలని, అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అనుమానాస్పద విత్తనాలు లేదా అక్రమ విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీసు స్టేషన్ లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని సీఐ ఓ. వెంకటేష్ కోరారు.
