దామర పోలీస్ స్టేషన్ కి కొత్త ఎస్ఐ– నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎస్ఐ వీరభద్రరావు
నడికూడ, జూన్ 29 ప్రజావాణి:
పోలీస్ అధికారుల బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమే. అయితే వరంగల్ కమిషనరేట్ పరిధి నుంచి దామెర పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా బదిలీ అయిన వీరభద్రరావుకు ప్రజలు, సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ, ప్రజలతో వ్యవహరించిన తీరు ఈ గుర్తింపుకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.
చిట్యాల నుంచి దామెర వరకు మారని సేవా దృక్పథం
చిట్యాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన సమయంలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు చేపట్టారు. శాయంపేట పోలీస్ స్టేషన్‌లో గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించారు.
కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, మారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని తన విధి నిర్వహణ ద్వారా చాటిచెప్పారు.
ప్రజా సేవే ప్రధాన ధ్యేయం
“యూనిఫాం ధరించిన తర్వాత ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే” అనే భావనతో విధులు నిర్వహిస్తానని ఎస్ఐ వీరభద్రరావు పేర్కొంటారని ఆయనతో కలిసి పనిచేసిన అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో గౌరవంగా వ్యవహరించడం, ఫిర్యాదులను పారదర్శకంగా స్వీకరించడం ఆయన ప్రత్యేకతగా పేర్కొంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా విధుల నిర్వహణ
చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయడమే తన బాధ్యత అనే నమ్మకంతో విధులు నిర్వహిస్తారని సహచరులు చెబుతున్నారు. బదిలీలు వచ్చినప్పటికీ ప్రజాసేవ పట్ల తన నిబద్ధత ఏమాత్రం తగ్గలేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
దామెర ప్రజల్లో ఆశాభావం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు దామెర పోలీస్ స్టేషన్‌కు నియమితులైన ఎస్ఐ వీరభద్రరావుపై స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్‌కు ఆయన ప్రాధాన్యం ఇస్తారని విశ్వసిస్తున్నారు.
నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజా సేవ పట్ల అంకితభావంతో పనిచేసే అధికారులు పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువస్తారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.