prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 11:31 am Digital Edition : VENU THIRUMALAYAPALEM

దమ్మాయిగూడెం గ్రామంలో ఈత చెట్లు కాలిపోయిన ఘటనపై రైతు వడ్డెబోయిన నరసయ్య వివరణ..

తిరుమలాయపాలెం, ప్రజావాణి:

తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో ఇటీవల ఈత చెట్లు కాలిపోయిన ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన రైతు వడ్డెబోయిన నరసయ్య స్పందిస్తూ పూర్తి వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో ఉపాధి హామీ కూలీలు గానీ, ఉపాధి హామీ అధికారులుగానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.రైతు వడ్డెబోయిన నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం తన సొంత వ్యవసాయ భూమిలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తానే స్వయంగా నిప్పు పెట్టినట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లే ముందు మంటలు పూర్తిగా ఆరిపోవాలని నీళ్లు కూడా చల్లినట్లు తెలిపారు. అయితే అనుకోకుండా మిగిలిన నిప్పురవ్వలు గాలికి ఎగిరి పక్కనే ఉన్న ఈత చెట్లకు అంటుకోవడంతో చెట్లు కాలిపోయినట్లు వివరించారు.ఈ ఘటన పూర్తిగా అనుకోకుండా జరిగిందని, దీనికి ఉపాధి హామీ పనులతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులపై తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలు తమ పనులు మాత్రమే నిర్వహిస్తున్నారని, ఈ ఘటనకు వారిని అనవసరంగా సంబంధపెట్టడం బాధాకరమని అన్నారు.అలాగే కాలిపోయిన ఈత చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రైతు వడ్డెబోయిన నరసయ్య తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. గ్రామ ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకొని అపోహలకు లోనుకాకూడదని ఆయన కోరారు.