ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడ గ్రామంలోని ఆర్జీకే పాఠశాలలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కూడా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగింది. ఏఈఆర్‌ఓ శశికుమార్ పర్యవేక్షణలో, బీఎల్‌వో సూపర్‌వైజర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎల్‌వోలు రేణుక, పద్మావతి, భార్గవి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు వేగవంతంగా సేవలు అందించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటి దరఖాస్తులను స్వీకరించి, ప్రజలకు అవసరమైన సూచనలు అందించారు. తొలి ఏకాదశి పండుగ దినమైనప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో కేంద్రానికి తరలివచ్చి ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకున్నారు. మహిళా బీఎల్‌వోలు ఎంతో ఓర్పుతో, అంకితభావంతో ప్రతి ఒక్కరికీ సేవలు అందిస్తూ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని అధికారులు కోరారు.