ఘట్‌కేసర్ మే 25 (ప్రజావాణి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 267వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్లు బి. ప్రభాకర్ రెడ్డి, ఎ. రాఘవేందర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై బి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి “విద్యను అభ్యసించండి, చైతన్యంతో పోరాడండి, సంఘటితంగా ముందుకు సాగండి” అనే సందేశాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఎస్సై ఎ. రాఘవేందర్ మాట్లాడుతూ గృహ సహాయకుల నమోదు మరియు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఇళ్ల యజమానులకు సూచించారు. సమాజ భద్రత కోసం ప్రతి ఇంటి యజమాని తమ సహాయకుల వివరాలను పోలీస్ శాఖ వద్ద నమోదు చేయాలని కోరారు. అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కేవలం ఎస్సీ, ఎస్టీల కోసమే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడి హక్కులు, సమానత్వం కోసం పోరాడిన మహానీయుడని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి భారతీయుడు లబ్ధి పొందుతున్నారని, యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బండారి రాందాస్ (అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ), వూట్కూరి అశోక్ గౌడ్, ఈరిటం శ్రీనివాస్ (జనరల్ సెక్రటరీ, అంబేద్కర్ యువజన సంఘం), కె. నర్సింగ్ రావు, కడప బిక్షపతి (వైస్ ప్రెసిడెంట్), నర్సింగ్ రావు (ప్రెసిడెంట్, వడ్డెర సంఘం, ఘట్‌కేసర్), కె. మహిపాల్, బాలానగరం సురేశ్ గౌడ్, ఈ. జగదీష్, ఎం. రాజు, మహేష్, యెల్లేష్, ఎస్. కృష్ణంరాజు, సి. నిఖిల్, సి. ఉపేందర్, ప్రవీణ్, అఖిల్, అనిల్, లక్ష్మణ్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
