*డయల్-100 కాల్‌కు వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో ఉరివేసుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన చండూరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
చండూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్, విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రదర్శించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. రాత్రి ఉడతలపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోందని డయల్-100 ద్వారా సమాచారం అందడంతో, విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ వెంటనే స్పందించి కేవలం 5 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా, ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంటనే సమయస్ఫూర్తితో ఇంటి ప్రధాన ద్వారం (మెయిన్ డోర్)ను పగులగొట్టి లోపలికి ప్రవేశించి, ఉరిని తొలగించి బాధితుడికి తక్షణ ప్రాథమిక సహాయం (CPR) అందించారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ చూపిన అప్రమత్తత, ధైర్యసాహసాలు, సమయానుకూల స్పందనను స్థానిక ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వేగంగా స్పందిస్తూ ప్రజల ప్రాణ రక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది.