prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 2:35 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

టీసీఏ వార్షిక సదస్సులో డా. సి. మల్లేశకు ప్రథమ ఉత్తమ పరిశోధనా పత్రం పురస్కారం

ఘట్‌కేసర్, జూన్ 26 (ప్రజావాణి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న డా. సి. మల్లేశ ప్రతిష్ఠాత్మక తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (టీసీఏ) నిర్వహించిన ఏడవ వార్షిక సదస్సులో ప్రథమ ఉత్తమ పరిశోధనా పత్రం పురస్కారాన్ని అందుకున్నారు.

“వికసిత భారత్–2047: కృత్రిమ మేధస్సు యుగంలో వాణిజ్యం మరియు నిర్వహణలో నూతన దృక్కోణాలు” అనే అంశంపై జూన్ 25న వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ వాణిజ్య, వ్యాపార నిర్వహణ కళాశాల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. మల్లేశ “కృత్రిమ మేధస్సు ఆధారిత గ్రామీణ ఆర్థిక సమగ్రత – వికసిత భారత్ 2047 లక్ష్య సాధన దిశగా గ్రామీణ కృత్రిమ మేధస్సు ఆర్థిక సమగ్రత సూచిక రూపకల్పన” అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

గ్రామీణ భారతదేశంలో ఆర్థిక సేవల విస్తరణలో కృత్రిమ మేధస్సు పాత్రను విశ్లేషించిన ఈ పరిశోధనలో, గ్రామీణ ప్రాంతాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆర్థిక సేవల అందుబాటును అంచనా వేయడానికి ప్రత్యేక సూచికను ప్రతిపాదించారు. వివిధ విద్యాసంస్థల నుంచి వచ్చిన అనేక పరిశోధనా పత్రాలలో ఉత్తమంగా ఎంపికైన ఐదు పత్రాలకు పురస్కారాలు ప్రదానం చేయగా, డా. మల్లేశ సమర్పించిన పత్రం ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఆయనకు రూ.5 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం మరియు ప్రథమ ఉత్తమ పరిశోధనా పత్రం పురస్కారాన్ని తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డి. చెన్నప్ప అందజేశారు.

డా. మల్లేశ సాధించిన ఈ విజయం ఆయన పరిశోధనా ప్రతిభ, విద్యా నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. కృత్రిమ మేధస్సు, ఆర్థిక సమగ్రత, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన చేస్తున్న విశిష్ట కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచిందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది డా. మల్లేశను అభినందించారు.