prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 8:01 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

టీడీపీ రాజకీయ కక్షతోనే బండి నిత్యానందరెడ్డి అరెస్ట్. జైలు నుండి విడుదలైన నిత్యానందరెడ్డి ని పరామర్శించిన రెడ్యం.

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి జూన్ 18) అలంఖాన్‌పల్లె కు చెందిన కలమల్ల పెద్ద దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలైన బండి నిత్యానందరెడ్డిని గురువారం ఆయన నివాసంలో పరామర్శించిన రెడ్యం, జరిగిన పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బండి నిత్యానందరెడ్డి తనను ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని, రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ, హత్యకు గురైన పెద్ద దస్తగిరి భార్య కలమల్ల రమణమ్మ స్వయంగా తమ కుటుంబానికి ఎలాంటి బినామీలు లేరని, వైఎస్సార్సీపీ నేతలతో పాటు టీడీపీ నాయకులతో కూడా తమకు సత్సంబంధాలు ఉన్నాయని బహిరంగంగా చెబుతున్నప్పటికీ, ఆ విషయాలను పూర్తిగా పక్కనపెట్టి బండి నిత్యానందరెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.రాజకీయంగా బలపడుతున్న నాయకుడిని లక్ష్యంగా చేసుకుని, వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకే ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్న నాయకులపై ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని, బండి నిత్యానందరెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టులో నిరూపితమై “కడిగిన ముత్యంలా” నిర్దోషిగా బయటపడతారని రెడ్యం ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో నిరపరాధులను వేధించే చర్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని, ఇలాంటి చర్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు సింగమల వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ విభాగం కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్, కాజీపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు ముత్తూరు రమణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.