జూన్ 12 నుంచి తెలంగాణలో ఉద్యోగుల మహా సంగ్రామం.
పెన్ డౌన్ తో రాష్ట్రాన్ని కదిలించనున్న ఉద్యోగ శక్తి.
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం స్తానిక గట్టయ్య సెంటర్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన బక్క జడ్సన్,కోటగిరి అశోక్ కుమార్,తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో “పెన్ డౌన్” ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు మాజీ ఏపీ బీసీసీ చైర్మన్ బక్క జడ్సన్, అడ్వకేట్ అశోక్ కుమార్ ప్రకటించారు.
శనివారం ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై కొనసాగిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఇక సహించబోమని, హక్కుల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ శక్తి ఏకమవుతోందని తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం నుంచే రాష్ట్రవ్యాప్త పోరాటానికి శంఖారావం పూరించిన ఈ సమావేశం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడుల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ పూర్తిగా అందకపోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ హక్కుల కోసం ఉద్యోగులు కోర్టులు, కమిషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా పెండింగ్ బకాయిల సమస్యపై స్పందించి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు శాఖల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ ఖాళీల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని హెచ్చరించారు. పాఠశాలలు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
అనేక ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే పనులు కొనసాగిస్తున్నప్పటికీ వారికి కనీస వేతన భద్రత, ఉద్యోగ రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలు, అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో కుటుంబాలను పోషించడం కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల జీతంతో కుటుంబాన్ని పోషించే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు.
సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్‌సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే “పెన్ డౌన్” ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
“ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం ఇక అనివార్యం…
తెలంగాణ ఉద్యోగ శక్తి ఒక్కటైతే ప్రభుత్వాలు కూడా వినాల్సిందే…
సమస్యల పరిష్కారం వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంద
ని నాయకులు స్పష్టం చేశారు.
