జిల్లెల్లలో ప్రైవేట్ పాఠశాలలో దారుణం
2 తరగతి చదువుతున్న సోఫియా పై ఉపాధ్యాయురాలు దాడి
విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయురాలు
ఉపాధ్యాయురాలు పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా/ప్రజావాణి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామంలోని క్రాసింగ్ వద్ద ఉన్న విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న సోఫియా అనే విద్యార్థినిని ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హోంవర్క్ నీటుగా చేయలేదనే కారణంతో విద్యార్థినిని కట్టెతో తీవ్రంగా కొట్టడంతో ఆమె శరీరంపై దద్దులు వచ్చినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో పాఠశాలల్లో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు, ఉపాధ్యాయుల చేతిలో శారీరక దాడులకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా, ఈ పాఠశాల యాజమాన్యం ఫీజుల విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఫీజులు చెల్లించలేదని ఎండలో నిలబెడుతున్నారనే ఆరోపణలు కూడా తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, పాఠశాల యాజమాన్యం సంబంధిత ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.