అనంతపురం (జూన్ 06) ప్రజావాణి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్నేళ్లుగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో అమలు అవుతున్న ఉచిత విద్యా సదుపాయాన్ని ఈ విద్యా సంవత్సరంలో కూడా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు డిమాండ్ చేశారు.యూనియన్ జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆయుఫ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సిన నిబంధన అమలులో భాగంగా జర్నలిస్టుల పిల్లలకు కూడా ఈ అవకాశం కల్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ప్రైవేటు విద్యాసంస్థలకు మెమో జారీ చేస్తుందని,ఈ ఏడాది కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.గత ఏడాది అప్పటి కలెక్టర్ వినోద్ కుమార్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పిస్తూ మెమో జారీ చేశారని గుర్తు చేశారు.ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు,స్ట్రింగర్లు,కాంట్రిబ్యూటర్లు నామమాత్రపు గౌరవ వేతనాలతోనే కుటుంబాలను పోషిస్తున్నారని పేర్కొన్నారు.జిల్లాలో కొనసాగుతున్న కరువు పరిస్థితుల కారణంగా చాలా మంది జర్నలిస్టులు తమ పిల్లల పాఠశాల ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అందువల్ల జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ లేదా ఉచిత విద్య అమలయ్యేలా విద్యాశాఖకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి, పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే అమలు చేయాలని కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మహమ్మద్ రసూల్,ఆర్‌వీఎస్ ప్రసాద్,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు నాగేంద్రనాథ్ రెడ్డి,యూనియన్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బాల రంగారెడ్డి కేపీ కుమార్,చిన్న పత్రికల నాయకులు చౌదప్ప,చలపతి,సనప రామకృష్ణ,లోకరాజు తదితరులు పాల్గొన్నారు