జర్నలిస్టుపై దాడి కేసులో హత్యాయత్నం నమోదు చేయాలి
పెద్దపల్లి బ్యూరో,మన సమగ్ర ప్రజావాణి జూలై 14
పెద్దపల్లి జిల్లా సుమన్ టీవీ రిపోర్టర్ శ్రీకాంత్ పై జరిగిన దాడి ఘటనలో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి,వెంటనే అరెస్టు చేయాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ…విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుడిపై జరిగిన దాడి ఒక వ్యక్తిపై జరిగిన ఘటన మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువలు,భావ ప్రకటన స్వేచ్ఛ,మీడియా స్వాతంత్ర్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రజలకు నిష్పక్షపాతంగా చేరవేయడం జర్నలిస్టుల బాధ్యత అని, అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాత్రికేయులపై దాడులు జరగడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం సహా చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను కోరారు.నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ విధులు నిర్వహించేలా ప్రభుత్వం,పోలీసుయంత్రాంగం భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.గాయపడిన జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్,ఎస్సీ,ఎస్టీ జర్నలిస్టు యూనియన్ వ్యవస్థాపకుడు అరెల్లి మల్లేష్,ప్రవీణ్ రెడ్డి, కాల్వ రమేష్,బందెల రాజశేఖర్,సుధాకర్,సంపత్, రాజు,ధార మధు,తిరుపతి, శంకర్,శ్రీనివాస్,జైపాల్, అక్షయ్,భాస్కర్,భూమేష్, శ్రీకాంత్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.